Minab school strike: మినాబ్ స్కూల్ దాడి వెనుక వీరే.. ఇరాన్ సంచలన ఆరోపణలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లోని ఓ పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనలో అమాయక చిన్నారులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో దాడికి బాధ్యులుగా పేర్కొంటూ అమెరికా నౌకాదళ అధికారుల ఫోటోలను ఇరాన్ తాజాగా విడుదల చేసింది. చిన్నారుల మరణాలకు వీరే కారణమని ఎక్స్ వేదికగా ఆరోపించింది. ఫిబ్రవరి 28న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహిస్తున్న సమయంలో, మినాబ్ ప్రాంతంలోని ఒక పాఠశాలను తొమహాక్ క్షిపణి తాకింది.
వివరాలు
160మందికి పైగా చిన్నారులు మృతి
ఈ దుర్ఘటనలో 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత భారత్, దక్షిణాఫ్రికా, నైజీరియాలో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయాలు ఈ దాడికి సంబంధించిన అధికారుల ఫోటోలను విడుదల చేశాయి. అమెరికా యుద్ధనౌకకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేఫ్రీ యీ యార్క్, కమాండింగ్ ఆఫీసర్ లీ ఆర్ టేట్ చిత్రాలను ఎక్స్‌లో పంచుకున్నాయి. ఈ ఇద్దరు నేరస్తులను గుర్తుంచుకోండి. వీరే మూడుసార్లు తొమహాక్ క్షిపణిని ప్రయోగించి 168 చిన్నారుల మరణాలకు కారణమయ్యారంటూ ఆయా రాయబార కార్యాలయాలు తమ పోస్టుల్లో పేర్కొన్నాయి.