Trump Assassination Threat: అమెరికా అధ్యక్షుడికి ముప్పు.. ఆయుధాలతో వైట్‌హౌస్ దగ్గర వెనిజులా వ్యక్తి పట్టివేత
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలని తన మెదడులో స్వరాలు వినిపిస్తున్నాయని చెప్పిన ఓ వెనిజులా వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు అరెస్ట్ చేశారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారులో మూడు తుపాకులు, భారీ సంఖ్యలో బుల్లెట్లు లభించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి వైట్‌హౌస్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ఓ కారులో అనుమానాస్పదంగా కూర్చున్న వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో కారును తనిఖీ చేశారు. అందులో మూడు వేర్వేరు తుపాకులు, డజన్ల కొద్దీ బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
అదుపులోకి తీసుకొని విచారణ
అంతేకాకుండా, ఆ కారు దొంగిలించబడినట్లు గతంలోనే ఫిర్యాదు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
అరెస్టయిన వ్యక్తిని రోనీ యోర్డ్రిక్స్ గువానిపా చిరినోస్ (Ronny Yordrix Guanipa Chirinos)గా గుర్తించారు.
తన మెదడులో కొన్ని స్వరాలు వినిపిస్తున్నాయని, అవి అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు వెళ్లి రిపబ్లికన్ పార్టీకి చెందిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలని చెబుతున్నాయని అతడు అధికారులకు తెలిపినట్లు సమాచారం.
దీంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు వెనిజులాకు చెందిన వలసదారుడు. 2024 మార్చిలో టెక్సాస్ మార్గం ద్వారా అమెరికాలోకి ప్రవేశించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం అతడు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చ
ఈ కేసులో అతడిపై అభియోగాలు నమోదు కాగా, ప్రస్తుతం యూఎస్ మార్షల్స్ సర్వీస్ కస్టడీలో ఉన్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ అధికారుల అప్రమత్తత కారణంగానే వైట్‌హౌస్ సమీపంలో మూడు ఆయుధాలతో ఉన్న వ్యక్తిని సకాలంలో అరెస్ట్ చేయగలిగామని చెప్పారు.
అతడు ఎవరికైనా హాని కలిగించకముందే అధికారులు పట్టుకున్నారని పేర్కొన్నారు. గతంలోనూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బెదిరింపులు వచ్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఆయా సందర్భాల్లో అమెరికా భద్రతా సంస్థలు చర్యలు తీసుకున్నాయి. తాజాగా వైట్‌హౌస్ సమీపంలో ఆయుధాలతో అనుమానితుడు పట్టుబడటంతో మరోసారి అధ్యక్షుడి భద్రత, వైట్‌హౌస్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లపై చర్చ మొదలైంది.