అమెరికాలో సిక్కు మేయర్ కు బెదిరింపు లేఖలు.. రాజీనామా చేస్తే ఓకే, లేదంటే చంపేస్తాం
అమెరికాలోని సిక్కు మేయర్ తీవ్ర బెదిరింపులకు గురయ్యారు. మేయర్ పదవికి వెంటనే రాజీనామా చేయకుంటే కుటుంబంతో సహా అందరినీ చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో భయాబ్రాంతులకు గురైన అమెరికన్ సిక్కు లీడర్ రవీందర్ ఎస్ భల్లా, ఆయా వివరాలను వెల్లడించారు. 2017లో న్యూజెర్సీలోని హోబోకెన్ సిటీ మేయర్ గా భల్లా తొలిసారిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే అమెరికాలోనే తొలి సిక్కు మేయర్ గా చరిత్ర సృష్టించారు. అనంతరం 2021లోనూ మరోసారి మేయర్ అయ్యారు. ఇటీవలే గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు లేఖలు రావడంపై భల్లా ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మేయర్ పదవికి రాజీనామా చేయాలని తనకు వచ్చిన బెదిరింపు లేఖలో ఉందని వాపోయారు.ఇప్పటికే 3 లేఖలు అందాయన్నారు.
మధ్యలో పెళ్లాం, పిల్లలు ఏం చేశారు
అమెరికాలో మేయర్ గా ఎన్నికైంది తానేనని, అధికార బాధ్యతలు చూడటం, వాటిపై తగిన నిర్ణయాలు తీసుకోవడం కూడా తన పనేనన్నారు. అయితే మధ్యలో తమ భార్యా పిల్లలు ఏం పాపం చేశారని, వారిని చంపుతానని ఎందుకు బెదిరిస్తున్నారని భల్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా పౌరుడిగా తనకు అందరూ సమానమేనని, అందరినీ ఒకేలా చూడాలని అనుకుంటానన్నారు. రాష్ట్రంలో అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నదే తన అభిప్రాయమని భల్లా వివరించారు. బెదిరింపు లేఖలు రావడం, దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు తన కుటుంబ భద్రత గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని భల్లా స్పష్టం చేశారు.