LOADING...
Iran-Isreal: ఇరాన్ ముగ్గురు అత్యున్నత అధికారుల మృతి.. ప్రపంచంపై ఇజ్రాయెల్‌ దాడి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఏం జరుగుతుంది?
ఇరాన్ ముగ్గురు అత్యున్నత అధికారుల మృతి..ఇప్పుడు ఏం జరుగుతుంది?

Iran-Isreal: ఇరాన్ ముగ్గురు అత్యున్నత అధికారుల మృతి.. ప్రపంచంపై ఇజ్రాయెల్‌ దాడి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఏం జరుగుతుంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంపై మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ ఏ ఒక్కరు ఊహించని విధంగా చేపట్టిన "ఆపరేషన్ రైజింగ్ లయన్‌" (Operation Rising Lion) లో ఇరాన్‌కు భారీ నష్టం జరిగింది. ఈ ఆకస్మిక దాడిలో దేశ సైనిక వ్యవస్థకు మూలస్థంభాలుగా ఉన్న ముగ్గురు అత్యున్నత స్థాయి సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగాయి. వ్యూహపరంగా కీలకమైన నేతల కోల్పోవడం ఇరాన్‌కు తీరని దెబ్బగా మారింది. ఈ దాడిలో చనిపోయిన ఆ ముగ్గురు శక్తిమంతులైన అధికారులు ఎవరు? దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

వివరాలు 

మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ (IRGC చీఫ్) 

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌ (IRGC)కు ఈయనే చీఫ్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమెనెయికి అత్యంత విశ్వసనీయుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. గత సంవత్సరం ఇజ్రాయెల్‌పై జరిగిన భారీ డ్రోన్, క్షిపణుల దాడులకు ఈయన ప్రధాన నిర్వాహకుడిగా నిలిచారు. అణు, క్షిపణి కార్యక్రమాల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. మేజర్ జనరల్ మొహమ్మద్ బాగెరీ (ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్) ఇరాన్‌లోని సుమారు 5 లక్షల మందితో కూడిన సైనిక దళానికి మోహమ్మద్ బాగెరీ అధిపతి. దేశంలోని అన్ని సైనిక కార్యకలాపాలను సమన్వయపరచే బాధ్యత ఆయనదే. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ, ఆయన అంతర్జాతీయ శాంతి చర్చలలో భాగస్వామిగా కూడా పనిచేశారు, ముఖ్యంగా సౌదీ అరేబియాతో సంబంధాల పునరుద్ధరణలో.

వివరాలు 

అలీ షమఖానీ (మాజీ జాతీయ భద్రతా చీఫ్) 

ఇరాన్ జాతీయ భద్రతా మండలిని సుదీర్ఘంగా 10 సంవత్సరాలపాటు నేతృత్వం వహించారు. దేశ భద్రతా వ్యూహాల రూపకల్పనలో ప్రసిద్ధి చెందిన వ్యూహకర్త. చైనా మధ్యవర్తిత్వంతో ఇరాన్-సౌదీ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణలో ఆయన పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఇరాన్ అధ్యక్ష పదవికి కూడా ఈయన పోటీ చేశారు. ఇరాన్ తక్షణ స్పందన ఏంటి? ఈ భారీ నష్టానికి వెంటనే స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమెనెయి, కీలక నియామకాలు ప్రకటించారు. కొత్త IRGC చీఫ్: మొహమ్మద్ పాక్‌పూర్ కొత్త ఆర్మీ చీఫ్: అబ్దుల్ రహీం మౌసవి

వివరాలు 

ఈ దాడి ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? 

ఈ దాడిని ఒక సాధారణ సైనిక చర్యగా చూడలేం. దీని ప్రభావం సుదీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఒకేసారి ముగ్గురు అగ్ర శ్రేణి సైనికాధికారుల మృతి, దేశ సైనిక వ్యూహాల్లో గందరగోళాన్ని కలిగిస్తుంది.ఈ గ్యాప్ ను పూరించేందుకు ఇరాన్ సమయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రతీకార దాడుల శాతం పెరుగుతుంది: ఇరాన్ ఈ దాడికి కచ్చితంగా ప్రతీకారం తీసుకునే అవకాశం ఉంది. ఇది మరో పెద్ద యుద్ధానికి దారితీయవచ్చు. ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం: మధ్యప్రాచ్యంలో పెరిగే ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ ఎకానమీకి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.