దౌత్య విభేదాల పరిష్కారానికి భారత్‌తో ప్రైవేట్‌గా చర్చించాలనుకుంటున్నాం: కెనడా
41మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కెనడా స్పందించింది. దౌత్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి తాము భారత్‌తో ప్రైవేట్‌గా చర్చించాలని అనుకుంటున్నట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ పేర్కొన్నారు. తాము భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, తమ దౌత్యవేత్తల భద్రతను చాలా సీరియస్‌గా తీసుకుంటామని మెలానీ జోలీ స్పష్టం చేశారు. అక్టోబర్ 10 నాటికి దాదాపు 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ కోరింది. గడువు ముగిసిన తర్వాత దేశంలో అదనంగా ఉన్న కెనడియన్ దౌత్యవేత్తలకు భద్రత కల్పించబోమని కేంద్రం చెప్పింది.
భారత్‌తో విబేధాలను పెంచుకోవాలనుకోవడం లేదు: ట్రూడో
ఈ అంశంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడారు. తాము భారత్‌తో విబేధాలను పెంచుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. తాము భారత్‌తో చాలా బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. బ్రిటీష్ కొలంబియాలో జూన్ 18న ఖలిస్థానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్ - కెనడా మధ్య దౌత్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపించిన తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ ఆరోపణలను భారత్ కొట్టి పారేసింది. ఈ ఆరోపణలు అసంబద్ధమైనవిగా అభివర్ణించింది.