Toilet war on US warship: ఇరాన్ వైపు మోహరించిన అమెరికా యుద్ధనౌకలో 'టాయిలెట్' సంక్షోభం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో, ఇప్పటికే అమెరికా సైన్యం ఇరాన్‌ను వ్యూహాత్మకంగా చుట్టుముట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో అమెరికా తన శక్తివంతమైన విమాన వాహక నౌక USS Gerald R. Fordతో పాటు మరికొన్ని యుద్ధనౌకలను ఇరాన్ వైపు మోహరించింది. అయితే యుద్ధం అధికారికంగా ప్రారంభం కాకముందే అమెరికా సిబ్బంది అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సమాచారం. ప్రత్యేకంగా, విమాన వాహక నౌకలో విధులు నిర్వహిస్తున్న సుమారు 4,500 మంది సిబ్బంది 'టాయిలెట్' సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని The Wall Street Journal వెల్లడించిన నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
మహిళా సిబ్బంది,పురుష సిబ్బందికీ ఇబ్బందులు
నివేదికల వివరాల ప్రకారం, గత ఎనిమిది నెలలుగా సముద్ర మధ్యలో విధులు నిర్వర్తిస్తున్న గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ నౌకలోని మురుగునీటి వ్యవస్థ ఇటీవల దెబ్బతింది. నౌక ఎప్పటికప్పుడు కదులుతూ ఉండడం, సరైన నిర్వహణలో లోపాలు తలెత్తడం వంటి కారణాల వల్ల అందులోని మొత్తం 650 మరుగుదొడ్లలో చాలా వరకు పనిచేయకపోవడం సమస్యగా మారింది. ఫలితంగా మహిళా సిబ్బంది మాత్రమే కాకుండా పురుష సిబ్బందికీ ఇబ్బందులు తప్పడం లేదు. మరుగుదొడ్లను వినియోగించేందుకు రోజుకు సుమారు 45 నిమిషాలపాటు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్య పరిష్కారానికి నౌకలోని సాంకేతిక సిబ్బంది రోజుకు దాదాపు 19 గంటలు కష్టపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడం లేదని సమాచారం.
వివరాలు
నాలుగు రోజుల వ్యవధిలో పనిచేయని 205 టాయిలెట్లు
ఇదే తరహా సమస్యలు ఇది తొలిసారి కావని సిబ్బంది చెబుతున్నారు. గత ఏడాది మార్చిలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 205 టాయిలెట్లు పనిచేయకుండా పోయాయని వారు వెల్లడించారు. అత్యాధునిక సదుపాయాలు ఉన్నప్పటికీ, సున్నితంగా పనిచేసే వాక్యూమ్ ఆధారిత మురుగునీటి వ్యవస్థపై ఆధారపడటం వల్ల ఇలాంటి అంతరాయాలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా, ఇరుకైన పైపుల నిర్మాణం కారణంగా ఒకే వాల్వ్ దెబ్బతిన్నా మొత్తం వ్యవస్థపై ప్రభావం చూపుతోందని వారు సూచిస్తున్నారు.
వివరాలు
పైపుల యాసిడ్ ఫ్లష్'కు రూ.3 కోట్ల వరకు వ్యయం
ఈ సమస్యలను సరిచేయాలంటే పైపులను యాసిడ్ ఫ్లష్ చేయాల్సి వస్తోందని, అందుకు సుమారు రూ.3 కోట్ల వరకు వ్యయం అవుతోందని సమాచారం. మరోవైపు, అమెరికా ప్రభుత్వం తన సైనిక కార్యకలాపాలను తరచుగా పొడిగిస్తుండటంతో కొంతమంది సిబ్బందిలో అసంతృప్తి పెరుగుతోందని, కొందరు సేవలు విరమించాలని భావిస్తున్నారని కూడా తెలుస్తోంది. ఇటీవల అమెరికా వెనెజువెలాపై దాడి చేసి అక్కడి అధ్యక్షుడు మదురో(Nicolás Maduro)ను అదుపులోకి తీసుకున్న సందర్భంలోనూ ఇదే నౌక నుంచి యుద్ధవిమానాలు ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.