Pak-Afghan: 400% పెరిగిన కిలో టమోటా ధరలు : అఫ్గాన్-పాక్ బోర్డర్ మూసివేత ఎఫెక్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అక్టోబర్ 11 నుండి పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మూసివేశారు. ఈ మూసివేత కారణంగా రెండు దేశాల ప్రజలపై తీవ్రమైన ప్రభావం ఏర్పడింది. సరిహద్దు మూసివేతతో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమ, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఘర్షణలు మొదలైన తరువాత పాకిస్థాన్‌లో టమాటా ధరలు సుమారు ఐదు రెట్లు పెరిగి, ప్రస్తుతం కిలో టమాటా 600 పాకిస్థానీ రూపాయలకు చేరిందని తెలిపింది. అలాగే, అఫ్గాన్ నుండి ఎక్కువగా దిగుమతి అయ్యే ఆపిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి.
వివరాలు
సరిహద్దులో రెండు వైపులా సుమారు 5,000 కంటైనర్లు
సాధారణంగా, పాక్-అఫ్గాన్ సరిహద్దు ద్వారా ప్రతి సంవత్సరం రెండు దేశాల మధ్య సుమారు 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని తెలిసిందే. కాబుల్‌లోని పాక్-అఫ్గాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఖాన్ జాన్ అలోకోజాయ్ ప్రకారం, సరిహద్దుల్లో ఘర్షణల కారణంగా వాణిజ్య, రవాణా కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల రోజూ సుమారు 1 మిలియన్ డాలర్ల (సుమారు 8 కోట్లు రూపాయలు) నష్టాన్ని భరించాల్సి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అఫ్గాన్ నుండి పాకిస్థాన్‌కి సరఫరా అయ్యే దాదాపు 5 కంటైనర్ల కూరగాయలు పాడైపోయాయని, సరిహద్దులో రెండు వైపులా సుమారు 5,000 కంటైనర్లు నిలిచిపోయినట్లు టోర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్‌లోని ఒక అధికార వర్గం వెల్లడించింది.
వివరాలు
అక్టోబర్ 25న ఇస్తాంబుల్‌లో చర్చలు
గత కొన్ని రోజులుగా సరిహద్దులో ఘర్షణలు, దాడులు కొనసాగుతూ పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారని సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో, గత వారం ఖతార్‌లోని దోహా నగరంలో పాక్, అఫ్గాన్ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకుబ్‌ల మధ్య చర్చలు జరిగాయి. చర్చల ఫలితంగా రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించగా, సరిహద్దు వాణిజ్యం ఇంకా ప్రారంభ కాలేదు. ఇరుదేశాల మధ్య తదుపరి రౌండ్ చర్చలు అక్టోబర్ 25న ఇస్తాంబుల్‌లో జరగనున్నాయి.