Loading...
Trump: ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం.. ట్రంప్‌కు సైనికాధికారుల బ్రీఫింగ్
ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం.. ట్రంప్‌కు సైనికాధికారుల బ్రీఫింగ్

Trump: ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం.. ట్రంప్‌కు సైనికాధికారుల బ్రీఫింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులకు అమెరికా సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై సైనిక చర్యకు సంబంధించిన కీలక వివరాలను అమెరికా ఉన్నత సైనికాధికారులు ట్రంప్‌కు వివరించినట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌పై ఏ విధంగా దాడులు చేయాలి? ఏయే ప్రాంతాల్లో సైనిక బలగాలు,యుద్ధ విమానాలను మోహరించాలి? అనే అంశాలపై ఆయనకు బ్రీఫింగ్ ఇచ్చారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్,పశ్చిమాసియాలో అమెరికా ఉన్నత కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పాల్గొన్నారు.

వివరాలు 

పీకాక్స్ పర్వతం, పలు అణు కేంద్రాలే  లక్ష్యం

మరోవైపు, దాడులు జరిగే అవకాశాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సైనిక బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలని గల్ఫ్ దేశాలకు అమెరికా ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

తాజా ప్రణాళిక ప్రకారం.. ఇరాన్‌కు చెందిన మౌలిక సదుపాయాలతో పాటు పీకాక్స్ పర్వతం, పలు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

ట్రంప్ ఈ దాడుల ప్రణాళికకు ఆమోదం తెలిపిన వెంటనే సైనిక చర్య ప్రారంభమయ్యే అవకాశం ఉందని కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ పరిణామాలపై ఇటీవల డెమోక్రటిక్ సెనేటర్ క్రిస్ మర్ఫీ కూడా స్పందించారు.

ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఇరాన్‌పై మరోసారి దాడులు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైందని వెల్లడించారు.

ఈ యుద్ధానికి సంబంధించిన ప్రణాళికలను కొంతమంది సెనేటర్లకు వివరించారని తెలిపారు.

వివరాలు 

తమను లొంగదీసుకోవాలని చూస్తే..

అయితే, ప్రతిపాదిత సైనిక చర్యల వల్ల నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించడం కష్టమని, పైగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్‌పై సైనిక చర్య చేపడతామంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబఫ్ తీవ్రంగా స్పందించారు.

ఒత్తిడి తీసుకొచ్చినా, బెదిరింపులకు దిగినా ఇరాన్‌ను లొంగదీసుకోవడం అమెరికాకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల అగ్రరాజ్యానికి ఎలాంటి ప్రయోజనం ఉండబోదని స్పష్టం చేశారు.

ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు ముందుకు సాగాలంటే ఇరాన్ ప్రతిపాదించిన ఏడు షరతులకు అమెరికా తప్పనిసరిగా అంగీకరించాలని గాలిబఫ్ తేల్చిచెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

హర్మూజ్‌లో నాలుగు చమురు ట్యాంకర్లు సీమైన్లను ఢీకొన్నాయన్న ఐఆర్‌జీసీ

హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నాలుగు చమురు ట్యాంకర్లు సీమైన్లను ఢీకొన్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది.

నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణించే నౌకలకు ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని హెచ్చరించింది.

అయితే, ప్రమాదానికి గురైన నాలుగు నౌకలు ఏ దేశానికి చెందినవి? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాయి? అనే వివరాలను మాత్రం ఐఆర్‌జీసీ వెల్లడించలేదు.

ADVERTISEMENT