LOADING...
Rains: ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో కుండపోత వర్షాలు.. 100 మందికి పైగా మృతి
ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో కుండపోత వర్షాలు.. 100 మందికి పైగా మృతి

Rains: ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో కుండపోత వర్షాలు.. 100 మందికి పైగా మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మొజాంబిక్‌, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో కుండపోత వర్షాలు కురవడంతో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు బాధితులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొజాంబిక్‌లో వర్షాలు, వరదల ప్రభావంతో రెండు లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వేల సంఖ్యలో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జింబాబ్వేలో కురిసిన వర్షాల కారణంగా 70 మంది మృతి చెందగా, వెయ్యికి పైగా ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. అక్కడ పాఠశాలలు, రహదారులు, వంతెనలు కూడా భారీగా దెబ్బతిన్నాయి.

Details

ముమ్మరంగా సహాయక చర్యలు ప్రారంభం

దక్షిణాఫ్రికాలో మృతుల సంఖ్య 30కు చేరింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల సహాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదలు ప్రఖ్యాత క్రుగార్ నేషనల్ పార్క్‌ను కూడా ప్రభావితం చేశాయి. పార్కులో చిక్కుకున్న సుమారు 600 మంది పర్యాటకులు, సిబ్బందిని సహాయక బృందాలు సురక్షితంగా తరలించాయి. లా నినా ప్రభావంతో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఆఫ్రికాలోని ఏడు దేశాల్లో వర్షాలు ఉద్ధృతంగా కురుస్తున్నాయని అమెరికా వాతావరణ హెచ్చరికల వ్యవస్థ వెల్లడించింది. ఈ పరిస్థితులు కొనసాగితే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Advertisement