
US: న్యూయార్క్‌లో టూరిస్ట్ బస్సు బోల్తా.. ఐదుగురు భారతీయులు మృతి?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్ హైవేపై భారతీయులు సహా పర్యాటకులతో ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నయాగరా జలపాతం సందర్శించిన అనంతరం న్యూయార్క్‌కు తిరిగి వస్తుండగా బఫెలో సమీపంలో ఈ ఘటన జరిగింది. మొత్తం 54 మంది టూరిస్టులు నయాగరా జలపాతాన్ని సందర్శించి తిరుగు ప్రయాణం అవుతుండగా, డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బఫెలోకు తూర్పున సుమారు 25 మైళ్లు (40 కిలోమీటర్లు) దూరంలో బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఉన్నవారిలో భారతీయులు, చైనీస్, ఫిలిప్పీన్స్ మూలాలకు చెందిన వారు ఉన్నారని అధికారులు తెలిపారు.
Details
బస్సుల్లో 54 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం
డ్రైవర్ పరధ్యానంలో ఉండటంతో నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. ఘటన స్థలానికి న్యూయార్క్ రాష్ట్ర పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురు మరణించగా మిగతా టూరిస్టులు ప్రాణాపాయం తప్పించుకున్నారని, గాయపడినవారిని ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు నిర్ధారించారు. పిల్లలు ఎవరూ మృతి చెందలేదని అమెరికా మీడియా తెలిపింది. బస్సు కెనడా సరిహద్దులోని నయాగరా జలపాతాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా, పెంబ్రోక్ సమీపంలోని హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. రక్షణ చర్యల్లో ఎనిమిది హెలికాప్టర్లు పాల్గొన్నాయి. డ్రైవర్ సజీవంగానే బయటపడగా, అతడిని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.