South Korea: దక్షిణకొరియా సైనిక శిక్షణలో అపశ్రుతి.. సొంత పౌరులపై బాంబులు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాలో గురువారం నిర్వహించిన సైనిక శిక్షణలో విషాద ఘటన చోటు చేసుకుంది.
పోచియాన్ ప్రాంతంలో సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుండగా, యుద్ధ విమానం ప్రమాదవశాత్తూ సామాన్య పౌరులపై బాంబులను విడిచింది.
ఈ ప్రమాదంలో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని స్పష్టం చేస్తూ, సైన్యం దేశ ప్రజలను క్షమాపణలు కోరింది.
వివరాలు
జనావాసాలపై ఎనిమిది బాంబులు
కేఎఫ్-16 యుద్ధ విమానం ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో కాకుండా, భిన్నమైన ప్రదేశంలో ఎంకే-82 బాంబులను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో విమానం జనావాసాలపైకి దూసుకెళ్లి, ఎనిమిది బాంబులను పడేసింది.
ఈ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ సంఘటనపై సైన్యం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చింది.
అంతేగాక, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా, త్వరలోనే అమెరికా-దక్షిణ కొరియా సైన్యాల సంయుక్త ప్రదర్శన జరగాల్సి ఉండటంతో, గురువారం నుంచి పోచియాన్‌లో ఇరు దేశాల సైన్యాలు శిక్షణ ప్రారంభించాయి.