
Donald Trump: 'నా చిత్రం చెత్తగా ఉంది'.. ఆ ఆర్టిస్ట్ వృద్ధురాలైపోయింది: ట్రంప్ ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
బిజినెస్ టైకూన్ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన వ్యక్తిగత ప్రతిష్టను, హావభావాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు.
ఇటీవల, ఓ చిత్రరచన ఆయనకు అసహనం కలిగించింది. మరీ ముఖ్యంగా, ఆ చిత్రాన్ని ఓ రాష్ట్ర గవర్నర్ చట్టసభ భవనంలో ప్రదర్శించడంతో, ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఈ ఘటనపై స్పందించిన ఆయన, సోషల్ మీడియా వేదికగా ఆ చిత్రాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు, గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఆ చిత్రాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో ఒక పోస్ట్ కూడా చేశారు.
వివరాలు
అద్భుతంగా బరాక్ ఒబామా చిత్రం
''ఎవరైనా తమ చెత్త ఫొటోలు,చిత్రాలను చూడటాన్నిఇష్టపడరని తెలిసిందే.కానీ కొలరాడో స్టేట్ క్యాపిటల్ భవనంలో,మిగతా అధ్యక్షుల చిత్రాలతో పాటు నా చిత్రాన్ని కూడా ఉంచారు.అయితే, అది చాలా చెత్తగా ఉంది.నా భవిష్యత్తులో కూడా అలాంటి చిత్రాన్ని చూడాలనుకోను. ఇది ఉద్దేశపూర్వకంగానే ప్రదర్శించారని అనిపిస్తోంది.అదే ఆర్టిస్ట్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చిత్రాన్ని గీసినప్పుడు అద్భుతంగా చిత్రించారు.కానీ నా చిత్రం మాత్రం అతి దారుణంగా ఉంది. ఆమె వయస్సు ఎక్కువ కావడంతో తన కళాత్మక ప్రతిభను కోల్పోయిందనిపిస్తోంది.అక్కడ జరిగే కార్యక్రమాల్లో నా ఫొటో లేకపోతే నాకు పరవాలేదు,కానీ ఇలాంటి చెత్త చిత్రాన్ని ఉంచడం మాత్రం నాకు అసహ్యంగా ఉంది.కొలరాడో నుంచి చాలా మంది ఫోన్ చేసి దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు,'' అని ట్రంప్ మండిపడ్డారు.
వివరాలు
ఆ వివాదాస్పద చిత్రం వెనుక కథ
అంతేకాదు, కొలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్‌ను విమర్శిస్తూ, ఆయన రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలను నియంత్రించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
ముఖ్యంగా, మాదకద్రవ్యాల ముఠాలను అదుపు చేయడంలో ఆయన విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. అయితే, తమ పరిరక్షణకు తాము కట్టుబడి ఉంటామని ట్రంప్ స్పష్టం చేశారు.
డెయిలీ మెయిల్ నివేదిక ప్రకారం, ఆ చిత్రాన్ని 2019లోనే ఆవిష్కరించారు. దీనిని సారా బోర్డ్‌మన్ అనే కళాకారిణి రూపొందించారు.
ఆమె 2012లో జార్జ్ డబ్ల్యూ బుష్ చిత్రాన్ని కూడా గీసింది. ఇక, ట్రంప్ తన పదవీకాలంలో శ్వేతసౌధంలో అనేక మార్పులు తీసుకువచ్చారు.
ప్రత్యేకంగా, తన ఫొటోలను బంగారు ఫ్రేములతో అలంకరించారని సమాచారం. అంతేకాదు, తన మగ్‌షాట్‌ను కూడా అక్కడ ప్రదర్శించారు.