
H-1B visa 'a scam': H-1B వీసా,గ్రీన్‌కార్డులపై ట్రంప్ కఠిన నియమాలు.. భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వీసా విధానాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేయనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా H-1B వీసాపై అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆయన ప్రకారం, అమెరికన్ కంపెనీలు ముందుగా స్థానిక కార్మికులను నియమించుకోవడమే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. "H-1B వీసా ఒక మోసం" ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లుట్నిక్ మాట్లాడుతూ.. "ప్రస్తుత H-1B వీసా వ్యవస్థ ఒక మోసం. ఇది విదేశీ కార్మికులకు అమెరికన్ల ఉద్యోగాలను చేజారేలా చేస్తోంది. గొప్ప అమెరికన్ కంపెనీలకు స్థానిక ఉద్యోగుల నియామకం ప్రధాన కర్తవ్యమై ఉండాలి" అని తేల్చి చెప్పారు.
వివరాలు
గ్రీన్ కార్డ్ కేటాయింపులపై ప్రశ్న
అమెరికాలో గ్రీన్ కార్డ్ జారీ విధానాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. "సగటు అమెరికన్ వార్షిక ఆదాయం 75,000 డాలర్లు ఉంటే, గ్రీన్ కార్డ్ పొందిన వారిది 66,000 డాలర్లు మాత్రమే. ఇలాంటివారికి ఎందుకు గ్రీన్ కార్డులు ఇస్తున్నాం? ఇది దిగువ స్థాయి వారిని ఎంపిక చేసినట్టే" అని వ్యాఖ్యానించారు. లాటరీ విధానానికి బదులు జీతం ఆధారిత ఎంపిక ప్రస్తుత లాటరీ ఆధారిత H-1B వీసా కేటాయింపును రద్దు చేసి, అధిక జీతాలు పొందే దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని లుట్నిక్ వెల్లడించారు. "ఈ ప్రోగ్రామ్ మారబోతుంది. గ్రీన్ కార్డ్ మారబోతుంది. ఇకపై ఎక్కువ జీతాలు ఉన్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
"అమెరికా ఫస్ట్" విధానం
వైట్ హౌస్ వర్గాలు ఈ చర్యలతో అమెరికన్ ఉద్యోగులను రక్షించగలమని, తక్కువ ఖర్చుతో పనిచేసే విదేశీ ఉద్యోగులను నియమించడాన్ని ఆపగలమని చెబుతున్నాయి. ట్రంప్, లుట్నిక్ ఇద్దరూ "ఎక్కువ జీతాలు ఉన్నవారిని ఆకర్షించాలి" అని పదే పదే హైలైట్ చేస్తున్నారు. అయితే, స్టార్టప్‌లు, చిన్న కంపెనీలు మరియు అంతర్జాతీయ విద్యార్థులు ఈ కొత్త విధానంలో నష్టపోతారని అమెరికా వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వివరాలు
ఇండియాపై ప్రభావం
H-1B వీసాలను పొందేవారిలో 70 శాతం మంది భారతీయులే. కాబట్టి ఈ మార్పులు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అధిక జీతాలు పొందే ఐటీ నిపుణులు అమెరికాకు వెళ్లే అవకాశాలు ఉన్నా,మధ్యస్థాయి ఉద్యోగులు, కొత్తగా చదువు పూర్తి చేసిన విద్యార్థులు,చిన్న కంపెనీల్లో పనిచేసేవారికి వీసాలు దొరకడం కష్టమవుతుంది. అనలిస్టులు చెబుతున్నట్లు,ఈ పరిమితులు అమెరికా కంపెనీలను భారత్‌లోనే తమ కార్యకలాపాలను విస్తరించేందుకు లేదా రిమోట్ వర్క్‌పై ఆధారపడేలా చేసేందుకు దారితీయవచ్చు. అలాగే,"గోల్డ్ కార్డ్"పేరుతో పెట్టుబడిదారులకు ప్రత్యేక నివాస పథకాన్ని ప్రోత్సహించడం ద్వారా అమెరికా,నైపుణ్యం,పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నదని స్పష్టం అవుతోంది. మొత్తం మీద, భారతీయ విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్స్ కోసం అమెరికా వీసా అవకాశాలు క్రమంగా కఠినతరం అవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.