Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలోకి 30 దేశాలకు ప్రయాణ నిషేధం?
ఈ వార్తాకథనం ఏంటి
వాషింగ్టన్ డీసీలో గత వారం నేషనల్ గార్డ్‌కు చెందిన ఇద్దరు సైనికులపై జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంతో ట్రంప్ ప్రభుత్వం ప్రయాణ నిషేధాన్ని మరింత విస్తరించడంపై ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం 19దేశాల పౌరులపై అమలులో ఉన్న ఈ ట్రావెల్ బాన్‌ను దాదాపు 30దేశాల వరకూ పెంచే యోచన ఉందని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనలు ఇప్పటికి ప్రాథమిక దశలోనే ఉన్నాయని,తుది జాబితాలో చేరే దేశాల సంఖ్య మారే అవకాశముందని తెలిపారు. తాజాగా హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయం అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా, అమెరికాలోకి నేరస్తులు వెల్లువలా వస్తున్నారని ఆరోపిస్తూ అన్ని దేశాలపై పూర్తి స్థాయి ప్రయాణ నిషేధం విధించాలని తాను సూచించినట్లు పేర్కొన్నారు.
వివరాలు
గ్రీన్ కార్డు దరఖాస్తులపై తిరిగి పరిశీలన
ఇదిలా ఉండగా, వాషింగ్టన్ దాడి అఫ్గాన్‌కు చెందిన వారు జరిపినట్లు అధికారులు చెబుతుండటంతో, ఆ ఘటనను ఆధారంగా చూపుతూ వలసలపై కఠిన చర్యలు మరింత పెంచేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అఫ్గాన్ పౌరులందరికీ వీసా,వలస ప్రక్రియలను నిలిపివేయడంతో పాటు, అన్ని దేశాల ఆశ్రయ దరఖాస్తులపై నిర్ణయాలను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రయాణ నిషేధంలో ఉన్న 19 దేశాలకు చెందిన గ్రీన్ కార్డు దరఖాస్తులపై తిరిగి పరిశీలన చేపట్టాలని ఆదేశాలిచ్చింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అఫ్గానిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వటోరియల్ గినియా,ఎరిట్రియా,హైటి, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ తదితర దేశాలపై దాదాపు పూర్తిస్థాయి నిషేధం అమలు చేయగా,బురుండి, క్యూబా,లావోస్, సియెర్రా లియోన్,టోగో, టర్క్‌మెనిస్తాన్, వెనిజువేలాపై పాక్షిక ఆంక్షలు కొనసాగుతున్నాయి.
వివరాలు
నిషేధ జాబితా విస్తరణపై త్వరలోనే అధికారిక ప్రకటన
ఆ దేశాల నుంచి వచ్చే వారిని సరైన రీతిలో తనిఖీ చేయలేకపోవడం, ఉగ్రవాద ముప్పు, డిపోర్టేషన్‌కు ఆయా ప్రభుత్వాలు సహకరించకపోవడం వంటి కారణాలే ఈ నిర్ణయాలకు కారణమని అప్పట్లో ట్రంప్ వివరించారు. ఇప్పుడు నిషేధ జాబితా విస్తరణపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ వెల్లడించింది.