United States : భారత మ్యాప్‌పై యూ-టర్న్.. ఎక్స్ పోస్ట్ తొలగించిన యూఎస్టీఆర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌కు సంబంధించి వివాదాన్ని రేపిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌ను యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) కార్యాలయం తన అధికారిక ఎక్స్ (X) ఖాతా నుంచి తొలగించింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), అక్సాయి చిన్ ప్రాంతాలను భారత్‌లో భాగంగా చూపించిన మ్యాప్‌ను జతచేసి ఈ పోస్ట్‌ను షేర్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఆ పోస్ట్‌ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. గత వారం భారత్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రకటనను యూఎస్టీఆర్ విడుదల చేసింది. అయితే, ఆ ప్రకటనకు జత చేసిన మ్యాప్‌లో పీవోకే, అక్సాయి చిన్‌లతో సహా మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో భాగంగా చూపించారు.
వివరాలు
అమెరికా విధానంలో మార్పు వచ్చిందన్న ఊహాగానాలకు తెర
సాధారణంగా వివాదాస్పద భూభాగాలను ప్రత్యేక గుర్తింపుతో చూపించే అమెరికా ప్రభుత్వ విధానానికి ఇది భిన్నంగా ఉండటంతో, ఈ అంశం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. ఈ మ్యాప్ పొరపాటున ప్రచురించారా? లేక కశ్మీర్ విషయంలో అమెరికా వైఖరిలో ఏమైనా మార్పు చోటుచేసుకున్నదా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఊహాగానాలు పెరిగిన వేళ, ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా యూఎస్టీఆర్ సైలెంట్ గా ఆ పోస్ట్‌ను తన ఖాతా నుంచి తొలగించింది. పీవోకే, అక్సాయి చిన్‌లతో పాటు మొత్తం జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలు తమ అంతర్భాగమేనని భారత్ ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది. కాగా, ఈ పోస్ట్ తొలగింపుకు సంబంధించిన కారణాలపై యూఎస్టీఆర్ కార్యాలయం ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.