Trump: ట్రంప్ కొత్త వీసా నిబంధనలకు కోర్టు బ్రేక్.. విదేశీ విద్యార్థులకు ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
ట్రంప్ వీసా విధానాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త వీసా నిబంధనల అమలును బోస్టన్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే కాలవ్యవధిపై పరిమితులు విధించేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రూపొందించిన ప్రతిపాదనలకు ఈ నిర్ణయంతో బ్రేక్ పడింది. నిబంధనలు అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
50 ఏళ్ల వ్యవస్థను మార్చడం సరికాదు
కొత్త వీసా నిబంధనలను తీసుకురావడానికి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం చూపిన కారణాలు పూర్తిగా సమర్థించదగినవిగా లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఐదు దశాబ్దాలకు పైగా అమల్లో ఉన్న విధానాన్ని ఒక్కసారిగా మార్చడం సరైన చర్య కాదని పేర్కొంది.
ప్రతిపాదిత నిబంధనలు అమలైతే అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు తగ్గే అవకాశం ఉందని, దాని ప్రభావం ఉన్నత విద్యారంగంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపైనా పడుతుందని కోర్టు హెచ్చరించింది.
వివరాలు
జులైలో ప్రతిపాదనలు విడుదల
అమెరికాలో చదువుకునేందుకు వచ్చే విదేశీ విద్యార్థుల నివాస కాలానికి పరిమితులు విధించే ప్రతిపాదనలను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం జులైలో విడుదల చేసింది.
ఎఫ్1 వీసాలపై వచ్చే విద్యార్థులకు నాలుగేళ్ల కాలపరిమితిని నిర్ణయించేలా నిబంధనలను రూపొందించింది.
అలాగే జే1 వీసాలపై అమెరికాకు వచ్చే ఎక్స్ఛేంజ్ విజిటర్లు, ఐ-వీసాలపై వచ్చే మీడియా ప్రతినిధులకు కూడా నిర్దిష్ట కాలపరిమితి విధించాలని ప్రతిపాదించింది.
వివరాలు
జులైలో ప్రతిపాదనలు విడుదల
ప్రస్తుతం ఎఫ్1 వీసాలపై అమెరికాకు వెళ్లే విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంతవరకు 'డ్యురేషన్ ఆఫ్ స్టేటస్' విధానం కింద అక్కడ ఉండే అవకాశం ఉంది.
అయితే ఈ విధానాన్ని తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చి ఉంటే మూడు లక్షల మందికిపైగా భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉండేది.
తాజా కోర్టు తీర్పుతో వారికి ప్రస్తుతానికి తాత్కాలిక ఊరట లభించింది.