Trump: వలసలపై ట్రంప్ కీలక ప్రకటన.. డెమోక్రాట్లతో ఒప్పందానికి సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో వలసల సమస్యపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ అంశంపై డెమోక్రాట్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే అక్రమ వలసదారులకు ఎలాంటి క్షమాభిక్ష కల్పించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికాలోకి రావాలనుకునే వారు సరైన విధానాలను అనుసరించాలని, దేశంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తేల్చి చెప్పారు. వైట్‌హౌస్‌లో సోమవారం అనూహ్యంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వలసల సమస్య పరిష్కారానికి డెమోక్రాట్లతో ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందా? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన.. డెమోక్రాట్లతో కలిసి పనిచేయడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పారు.
వివరాలు
సలహాదారు స్టీఫెన్ మిల్లర్‌పై ట్రంప్ ప్రశంసలు
అయితే అక్రమంగా అమెరికాలోకి వచ్చిన వారికి క్షమాభిక్ష కల్పించే విషయంలో మాత్రం వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు.
ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, గడువు, అర్హతలపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఈ సందర్భంగా తన సలహాదారు స్టీఫెన్ మిల్లర్‌పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు.
ఆయన ఎంతో తెలివైన వ్యక్తి అని, కఠినంగా వ్యవహరించినప్పటికీ న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు.
అవసరమైతే డెమోక్రాట్లతోనూ కలిసి పనిచేయగల సామర్థ్యం ఆయనకు ఉందని అభిప్రాయపడ్డారు.
వివరాలు
కేవలం 48 నిమిషాల్లోనే వెనెజువెలా సైనిక ఆపరేషన్
మరోవైపు ఇంధన, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా మంజూరు చేసేలా రూపొందించిన బిల్లుకు ట్రంప్ మద్దతు ప్రకటించారు.
ఈ బిల్లుకు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని తెలిపారు. అయితే అందులో ప్రతిపాదించిన పవన విద్యుత్ టర్బైన్ల ఏర్పాటుకు మాత్రం అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
బిల్లుకు సంబంధించి చర్చలు ఇంకా ముగియలేదని వెల్లడించారు. ఇక వెనెజువెలా, ఇరాన్‌లలో అమెరికా చేపట్టిన సైనిక చర్యలపైనా ట్రంప్ స్పందించారు.
వెనెజువెలాలో నిర్వహించిన సైనిక ఆపరేషన్ కేవలం 48 నిమిషాల్లోనే ముగిసిందని చెప్పారు. ఈ చర్యలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని పేర్కొన్నారు.
వివరాలు
ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా ధ్వంసం
అలాగే ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని ప్రకటించారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉందని కూడా వెల్లడించారు. అయితే ఈ వాదనలకు సంబంధించి స్వతంత్రంగా ధ్రువీకరించే ఆధారాలను మాత్రం ట్రంప్ అందించలేదు.
క్యూబా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అక్కడి ప్రజలకు అమెరికా మానవతా సాయం అందిస్తోందని తెలిపారు.