LOADING...
Trump: భారత్‌కు ట్రంప్‌ భారీ షాక్‌.. వాటిపై 100 శాతం సుంకాలు
భారత్‌కు ట్రంప్‌ భారీ షాక్‌.. వాటిపై 100 శాతం సుంకాలు

Trump: భారత్‌కు ట్రంప్‌ భారీ షాక్‌.. వాటిపై 100 శాతం సుంకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
07:47 am

ఈ వార్తాకథనం ఏంటి

సుంకాల యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఆయన లక్ష్యం ఫార్మాస్యూటికల్ దిగుమతులపై పడింది. బ్రాండెడ్, పేటెంట్‌ ఉన్న ఔషధ ఉత్పత్తులపై 100 శాతం వరకు సుంకాలు (Tariffs) విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భారత ఔషధ పరిశ్రమకు పెద్ద సవాలుగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్యలు అమెరికాలో తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా ట్రంప్ పేర్కొన్నారు. ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కుల దిగుమతులపై 25 శాతం సుంకాలు అమలు చేస్తామని వెల్లడించారు. ఔషధ ఉత్పత్తుల విషయంలో మాత్రం ప్రత్యేకంగా 100 శాతం సుంకం వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

వివరాలు 

భారతీయ ఔషధ రంగంపై ప్రభావం 

అయితే అమెరికాలో ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న విదేశీ ఔషధ కంపెనీలకు ఈ కొత్త సుంకాలు వర్తించవని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్ వేదికలో ప్రకటించారు. అమెరికా, భారత ఔషధ కంపెనీలకు అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం. 2024లో భారత్ మొత్తం 27.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఔషధాలను ప్రపంచానికి ఎగుమతి చేసింది. అందులో 3.6 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులు అమెరికాకు చేరాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2025 మొదటి అర్థభాగంలోనే దాదాపు 3.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు అమెరికాకు జరగడం.

వివరాలు 

బ్రాండెడ్‌, పేటెంట్‌ ఉత్పత్తులపై సుంకాలు 

ట్రంప్‌ సుంకాలు ప్రత్యేకంగా బ్రాండెడ్‌, పేటెంట్‌ ఉత్పత్తులపై వర్తిస్తాయని స్పష్టత వచ్చింది. భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే మందుల్లో ప్రధానంగా జనరిక్‌ ఔషధాలే ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ కొత్త నిర్ణయం స్పెషాలిటీ డ్రగ్స్ తయారు చేసే భారత మల్టీనేషనల్ కంపెనీలకు గట్టి దెబ్బ తగిలే అవకాశముంది. ఫలితంగా సిప్లా, డివిస్ లాబ్స్‌, అజంత ఫార్మా వంటి ప్రముఖ సంస్థలు, అలాగే నిఫ్టీ ఫార్మా సూచీలోని షేర్లు ఇప్పటికే ప్రభావం చూపుతున్నాయి.

వివరాలు 

మరింత తప్పదు! 

ప్రస్తుతం 100 శాతం సుంకాలు ప్రకటించిన ట్రంప్, భవిష్యత్తులో ఈ రేటును మరింతగా పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆ సుంకాలు 150% నుంచి 250% వరకు పెరగవచ్చని సంకేతాలు ఇచ్చారు. ఇక అమెరికాలో కొత్తగా తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్న కంపెనీలకు మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే అక్కడ ప్లాంట్లు కలిగిన సంస్థలకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందా అనే అంశంపై ఇంకా అనిశ్చితి ఉంది.