
America: ట్రంప్ కీలక ఉత్తర్వులు.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తొలి పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేస్తూ, మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ,19 దేశాల పౌరులపై అమెరికాలోకి ప్రవేశించడాన్ని నిరోధిస్తూ బుధవారం కొత్త ప్రయాణ ఆంక్షలపై ఆయన సంతకం చేశారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం,12 దేశాల పౌరులపై పూర్తిస్థాయి నిషేధం అమలులోకి రానుండగా,మిగిలిన 7 దేశాలకు పాక్షిక పరిమితులు వర్తిస్తాయి.
పూర్తిగా నిషేధిత దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్,బర్మా,చాద్,కాంగో రిపబ్లిక్,ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ దేశాలు ఉన్నాయి.వీటి పౌరులకు అమెరికాలో ప్రవేశం పూర్తిగా నిషేధించబడింది.
ఇక బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్థాన్, వెనిజులా వంటి దేశాల పౌరులకు పాక్షికంగా పరిమితులు విధించారు.
వివరాలు
జాతీయ భద్రత కారణాలతోనే ఈ నిర్ణయమన్న వైట్ హౌస్
2025 జనవరి 20న ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవిలోకి వచ్చిన రోజే జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు 14161 ప్రకారం ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
శ్వేతసౌధం ప్రకారం,ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు వివిధ దేశాల వల్ల అమెరికాకు ఉండే ప్రమాదాలను విపులంగా విశ్లేషించారని పేర్కొంది.
సందర్శకులు,వీసా దరఖాస్తుదారుల నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలించడం సాధ్యపడని దేశాలు అమెరికా భద్రతకు ప్రమాదంగా మారతాయని అంచనా వేసి, అలాంటి దేశాలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలియజేసింది.
గమనించదగిన విషయం ఏమిటంటే, 2017లో ట్రంప్ తీసుకున్న ప్రయాణ నిషేధ నిర్ణయం ముఖ్యంగా ముస్లిం దేశాలను లక్ష్యంగా తీసుకుని తీసుకోబడినదిగా భావించడంతో కోర్టుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంది.
వివరాలు
కొన్ని వర్గాలకు మినహాయింపులు ప్రకటన
అటువంటి సమస్యలు మళ్లీ రాకుండా చూసేందుకు ఈసారి నెలల తరబడి జాగ్రత్తగా ప్రణాళిక రచించినట్లు సమాచారం.
'ట్రంప్ వర్సెస్ హవాయి'కేసులో అధ్యక్షుడు ప్రయాణ ఆంక్షలు విధించే అధికారాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని, తాజాగా విడుదలైన వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ గుర్తుచేసింది.
ఇక ఈ కొత్త నిబంధనల నుంచి చట్టబద్ధ శాశ్వత నివాసితులు (గ్రీన్ కార్డ్ హోల్డర్లు), ఇప్పటికే వీసాలు కలిగిన వారు, కొన్ని ప్రత్యేక వీసా కేటగిరీల వారు, అమెరికా జాతీయ ప్రయోజనాల కోసం అవసరమైన వ్యక్తులు మినహాయింపు పొందే అవకాశముంది.
ఈ చర్యపై ట్రంప్ స్పందిస్తూ.. ''విదేశాల నుంచి వచ్చే తీవ్రవాదులు,ఇతర జాతీయ భద్రతా,ప్రజా భద్రతకు ప్రమాదంగా మారే వ్యక్తుల నుండి అమెరికాను కాపాడడానికే ఈ 'సాధారణ భద్రతా ప్రమాణాలు' రూపొందించినట్లు''తెలిపారు.