LOADING...
Tump: గాజా పునరావాసానికి 700 కోట్ల డాలర్లు: శాంతి మండలిలో నిర్ణయం: ట్రంప్
గాజా పునరావాసానికి 700 కోట్ల డాలర్లు: శాంతి మండలిలో నిర్ణయం: ట్రంప్

Tump: గాజా పునరావాసానికి 700 కోట్ల డాలర్లు: శాంతి మండలిలో నిర్ణయం: ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గాజా పునరావాసానికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. గాజా పునర్నిర్మాణం కోసం 700 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు 'శాంతి మండలి'లోని తొమ్మిది సభ్య దేశాలు అంగీకరించినట్లు వెల్లడించారు. కజకస్థాన్, ఉజ్బెకిస్థాన్, యూఏఈ, మొరాకో, బహ్రైన్, ఖతార్, సౌదీ అరేబియా, అజర్‌బైజాన్, కువైట్ దేశాలు ఈ నిధులను సమకూర్చేందుకు ముందుకు వచ్చాయని గురువారం తెలిపారు. అదనంగా, భద్రతా బలగాలను పంపేందుకు ఐదు దేశాలు సిద్ధంగా ఉన్నాయని, మొదటిగా రఫా ప్రాంతంలో వాటిని మోహరించనున్నట్లు చెప్పారు. గాజాలో ఖర్చు చేసే ప్రతి డాలర్‌ అక్కడి స్థిరత్వానికి పెట్టుబడిగా మారుతుందని, కొత్త సామరస్య వాతావరణానికి ఇది దారితీస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు.

వివరాలు 

గాజా పునర్నిర్మాణానికి 7,000 కోట్ల డాలర్లు

ఇప్పటికే గాజా పునర్నిర్మాణానికి మొత్తం 7,000 కోట్ల డాలర్లు అవసరమని అంచనా వేశారు. ఇదే సందర్భంలో శాంతి మండలికి అమెరికా వెయ్యి కోట్ల డాలర్లు అందజేస్తుందని ట్రంప్‌ ప్రకటించినప్పటికీ, ఆ నిధులు ఏ అవసరాల కోసం వినియోగించబడతాయో వివరించలేదు. ఐక్యరాజ్య సమితి మరింత బలోపేతం కావడంతో పాటు సమర్థంగా పనిచేయడానికి శాంతి మండలి సహకరిస్తుందని తన ప్రారంభ ప్రసంగంలో చెప్పారు. ఈ మండలి ఐరాసతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

వివరాలు 

పాకిస్తాన్‌కు సమర్థుడైన ఫీల్డ్‌మార్షల్

రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత తొలి ఏడాదిలోనే భారత్‌-పాక్‌ సహా ఎనిమిది యుద్ధ వివాదాలను పరిష్కరించామని, అయితే వాటిలో ఏ ఒక్క అంశంపైనా ఐరాసతో చర్చించలేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌కు సమర్థుడైన ఫీల్డ్‌మార్షల్‌ ఉన్నారని ప్రశంసించారు. తాను పదవిలో లేకపోయినా ఐరాస దృఢంగా కొనసాగేందుకు శాంతి మండలి తోడ్పడుతుందని తెలిపారు. అదేవిధంగా బంగ్లాదేశ్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తారిఖ్‌ రెహ్మాన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. బంగ్లాదేశ్‌తో వాణిజ్య,రక్షణ రంగాల్లో మరింత బలమైన భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలని అమెరికా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement