Trump: హూతీలపై వైమానిక దాడులకు రెడీ.. అనూహ్యంగా వెనక్కి తగ్గిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
యెమెన్‌లోని హూతీ స్థావరాలపై భారీ దాడులకు అమెరికా సైన్యం సిద్ధమైంది. యుద్ధ విమానాల్లో బాంబులను లోడ్ చేయడంతో పాటు, అమెరికా కమాండర్లు దాడి చేయాల్సిన లక్ష్యాలను కూడా ఖరారు చేశారు. ఇక యెమెన్‌పై పెద్ద ఎత్తున వైమానిక దాడులు ప్రారంభం కానున్నాయని భావించిన సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మిషన్ నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. మిత్రదేశమైన సౌదీ అరేబియా స్వయంగా సైనిక సాయం కోరినప్పటికీ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎర్ర సముద్రం సమీపంలోని కీలక వ్యూహాత్మక ప్రాంతాల్లో యెమెన్ మిలిషియా, హూతీలు తమ ఆధిపత్యాన్ని వేగంగా పెంచుకుంటున్నట్లు సమాచారం.
వివరాలు
అమెరికా నుంచి సైనిక సహాయం కోరిన సౌదీ యువరాజు
ముఖ్యంగా ఇరాన్ మద్దతు ఉన్న హూతీలు వెనక్కి తగ్గకుండా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
ఈ పరిణామాలు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌లో ఆందోళన పెంచినట్లు తెలుస్తోంది.
ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా కొనసాగిస్తున్న యుద్ధానికి సౌదీ యువరాజు ప్రధాన మద్దతుదారుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో తమ మిత్రదేశమైన అమెరికా నుంచి సైనిక సహాయం కోరినట్లు సమాచారం.
మహ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా ట్రంప్‌కు ఫోన్ చేసి అత్యవసర సైనిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
అయితే సౌదీ అరేబియా, హూతీల మధ్య జరుగుతున్న పోరులో నేరుగా జోక్యం చేసుకోవడం ట్రంప్‌కు మొదటినుంచీ ఇష్టం లేదని సమాచారం.
ఈ విషయాన్ని ఆయన తన సలహాదారుల వద్ద కూడా ప్రస్తావించినట్లు ఓ అధికారి వెల్లడించారు.
వివరాలు
హూతీలపై ట్రంప్ యూటర్న్?
అయితే సౌదీ యువరాజుతో మాట్లాడిన తర్వాత ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
హూతీలపై వైమానిక దాడులకు సిద్ధం కావాలని పెంటగాన్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
దీంతో యెమెన్‌లో హూతీలపై అమెరికా భారీ దాడులు తప్పవని భావించారు.
అయితే చివరి నిమిషంలో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుని హూతీలపై దాడుల నుంచి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామంపై శ్వేతసౌధం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వివరాలు
వారు వ్యతిరేకించడమే కారణమా?
హూతీలపై దాడుల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడానికి ఆయన అంతర్గత బృందం నుంచి వచ్చిన వ్యతిరేకత కూడా ఒక కారణమై ఉండొచ్చని తెలుస్తోంది.
హూతీలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంతో పాటు సౌదీ అరేబియాకు సైనిక సాయం అందించాలనే ప్రతిపాదనను ట్రంప్ బృందంలోని పలువురు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఓ అధికారి తెలిపారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరులో అమెరికా సైన్యం ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని వారు భావిస్తున్నట్లు సమాచారం.
ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు హూతీలతో నేరుగా ఘర్షణకు దిగడం వల్ల అమెరికా సైన్యంపై అదనపు భారం పడుతుందని ట్రంప్ అంతర్గత బృందంలోని కొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
వివరాలు
అమెరికా నౌకలను టార్గెట్ చేయబోం: హూతీలు
ఇదిలా ఉండగా, ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని హూతీలు కీలక ప్రకటన చేశారు.
ఈ అంశంపై ఇప్పటికే అమెరికాతో చర్చలు జరిపినట్లు హూతీల రాజకీయ విభాగం సభ్యుడు మొహమ్మద్ అల్ బుఖైతీ వెల్లడించారు.
ఇతర దేశాలకు చెందిన నౌకలను కూడా లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
సౌదీ అరేబియాను మినహాయిస్తే ఎర్ర సముద్రంలో ఇప్పటివరకు మరే ఇతర దేశానికి చెందిన నౌకలను తాము లక్ష్యంగా చేసుకోలేదని బుఖైతీ పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ ఇతర దేశాల నౌకలపై దాడులు చేయబోమని చెప్పారు. ఇతర దేశాలు తమకు వ్యతిరేకంగా సౌదీ అరేబియాతో కలిసి పనిచేయనంత కాలం ఎవరి జోలికీ వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు.