Trump: మావో,స్టాలిన్,హిట్లర్‌ల కంటే తనకే ఎక్కువ శక్తి.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన పాలకులైన మావో జెడాంగ్, జోసెఫ్ స్టాలిన్, అడాల్ఫ్ హిట్లర్, నెపోలియన్, చెంఘీజ్ ఖాన్, అట్టిలా ది హన్ వంటి నేతల కంటే తనకే ఎక్కువ అధికారం ఉందని ట్రంప్ భావించినట్లు ఓ కొత్త పుస్తకం వెల్లడించింది. అమెరికాకు చెందిన ప్రముఖ జర్నలిస్టులు మ్యాగీ హాబెర్మన్, జోనాథన్ స్వాన్ రచించిన 'రెజీమ్ చేంజ్' పుస్తకంలో ఈ ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. పుస్తకం ప్రకారం,ఈ ఏడాది మార్చిలో ట్రంప్‌తో జరిగిన సమావేశంలో ఆయన రెండు పేజీల లేఖను జర్నలిస్టులకు చూపించారు.
వివరాలు
గ్యారీ ప్లేయర్‌కు చాలా కాలంగా క్యాడీగా పనిచేసిన వ్యక్తే పుస్తకం రాసింది
ఓ "చరిత్రకారుడు" ఈ లేఖ రాశాడని,గతంలోని శక్తిమంతమైన పాలకులందరి ప్రభావం తమ ప్రాంతాలకే పరిమితమైందని,కానీ ట్రంప్ అధికారానికి ప్రపంచవ్యాప్త ప్రభావం ఉందని అందులో పేర్కొన్నట్లు తెలిపారు. భయాన్ని ఆయుధంగా చేసుకుని వారు పాలించారని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు రచయితలు వెల్లడించారు. అయితే, ఆ లేఖ రచయిత నిజంగా చరిత్రకారుడు కాదని తర్వాత తేలింది. ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు గ్యారీ ప్లేయర్‌కు చాలా కాలంగా క్యాడీగా పనిచేసిన వ్యక్తే దాన్ని రాశాడని పుస్తకంలో పేర్కొన్నారు. గోల్ఫ్ ఆడుతున్న సమయంలో ట్రంప్‌కు తన అభిప్రాయాలను వివరించినట్లు అతడు చెప్పినట్లు రచయితలు వెల్లడించారు.
వివరాలు
మంగళవారం విడుదల కానున్న'రెజీమ్ చేంజ్'పుస్తకం
ట్రంప్ ఇటీవల తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో కూడా ఆ లేఖను పోస్టు చేసి,దానిని ఓ అధ్యక్ష చరిత్రకారుడు రాసినట్లుగా పేర్కొన్నారు. పుస్తకం విడుదలకు ముందే ఈ విషయాన్ని ప్రచారంలోకి తెచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం విడుదల కానున్న'రెజీమ్ చేంజ్'పుస్తకం ట్రంప్ రెండో అధ్యక్ష పదవీకాలంలోని తొలి 14 నెలలపై దృష్టి సారించింది. 1,000మందికిపైగా వ్యక్తులతో మూడు సంవత్సరాల పాటు చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పుస్తకాన్ని రచించినట్లు రచయితలు తెలిపారు. ట్రంప్ అధికార వినియోగం,అంతర్జాతీయ రాజకీయాలు,ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై ఆయన నిర్ణయాలు,ఉక్రెయిన్ సంక్షోభం,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సంబంధాలు, తన సొంత మంత్రివర్గ సభ్యులతో వ్యవహరించిన తీరు వంటి అనేక అంశాలను ఇందులో ప్రస్తావించారు.
వివరాలు
సంప్రదాయాలకు భిన్నంగా నిర్ణయాలు
అంతేకాకుండా, వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో బంగారు అలంకరణలను స్వయంగా సూపర్ గ్లూతో అతికించిన ఘటన, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై చేసిన వ్యాఖ్యలు, ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ జెరోమ్ పావెల్‌పై అసంతృప్తి, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో జరిగిన ఘర్షణపై స్పందన వంటి పలు ఆసక్తికర సంఘటనలను కూడా రచయితలు వివరించారు. అమెరికా రాజకీయాల్లో ట్రంప్ రెండో దఫా పాలన మరింత దూకుడుగా సాగుతోందని, సంప్రదాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ తన అధికారాన్ని వినియోగిస్తున్న తీరును ఈ పుస్తకం ఆవిష్కరించినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.