Trump-Hegseth: ఇరాన్ యుద్ధంతో అమెరికాకు ఆయుధాల సంక్షోభం?.. ట్రంప్-హెగ్సెత్ వివాదం చర్చనీయాంశం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికాలోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెంచడమే కాకుండా అమెరికా, ఇరాన్ దేశాలపై కూడా వివిధ రకాల ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా వద్ద కీలక క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయని ఇప్పటికే పలువురు విశ్లేషకులు, అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడి అధికారిక విశ్రాంతి కేంద్రం క్యాంప్ డేవిడ్‌లో జరిగిన కీలక సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
వివరాలు
అధ్యక్షుడు, రక్షణ మంత్రి మధ్య అభిప్రాయ భేదాలు
తగ్గిపోతున్న క్షిపణి నిల్వలపై పూర్తి సమాచారం ఎందుకు అందించలేదని ట్రంప్ రక్షణ మంత్రిని ప్రశ్నించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.
ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత అధ్యక్షుడు, రక్షణ మంత్రి మధ్య అభిప్రాయ భేదాలు పెరుగుతున్నాయనే సంకేతాలను ఈ ఘటన ప్రతిబింబిస్తోందని కూడా విశ్లేషించాయి.
ఇరాన్‌పై పూర్తిస్థాయి దాడులు చేపట్టేందుకు అవసరమైన కీలక ఆయుధాల కొరత ఏర్పడటంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆయుధాల కొరత త్వరలోనే పరిష్కారమవుతుందని తాను భావించానని,అయితే ఇప్పటికీ అదే పరిస్థితి ఎందుకు కొనసాగుతోందో వివరణ ఇవ్వాలని హెగ్సెత్‌ను ప్రశ్నించినట్లు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా వెల్లడించింది.
వివరాలు
తక్కువ వ్యయంతో తయారయ్యే డ్రోన్లను వినియోగిస్తున్న ఇరాన్
దీనికి ప్రతిగా హెగ్సెత్ తన నిర్ణయాలను సమర్థించుకున్నారని, అధ్యక్షుడికి పూర్తి స్థాయి సమాచారం అందించడంలో లోపం జరిగిందంటూ రక్షణశాఖ సహాయ మంత్రిపైనే బాధ్యత మోపినట్లు కథనాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ తక్కువ వ్యయంతో తయారయ్యే డ్రోన్లను భారీ స్థాయిలో వినియోగిస్తోంది.
ఒక్కో డ్రోన్ ధర 20 వేల నుంచి 50 వేల డాలర్ల మధ్య మాత్రమే ఉండగా, వాటిని కూల్చివేయడానికి అమెరికా ఉపయోగిస్తున్న ఒక్కో ఇంటర్‌సెప్టర్ క్షిపణి ధర సుమారు 1.5 మిలియన్ డాలర్లకు పైగా ఉంది.
దీంతో యుద్ధ వ్యయం మరింత పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
వివరాలు
థాడ్,పేట్రియాట్ కీలక క్షిపణుల నిల్వలు తగ్గిపోయాయని అంతర్జాతీయ కథనాలు
అదే సమయంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం కావడంతో పలు స్థావరాలు దెబ్బతిన్నాయి.
వాటి రక్షణ కోసం అమెరికా పెద్ద ఎత్తున పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్‌లు,ఇతర ఆధునిక ఆయుధాలను వినియోగించింది.
ఈ కారణంగా థాడ్,పేట్రియాట్ వంటి కీలక క్షిపణుల నిల్వలు తగ్గిపోయాయని ఇప్పటికే పలు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.
ఇక ఇరాన్‌పై అత్యంత తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని, అవి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత శక్తివంతమైన దాడులుగా నిలుస్తాయని ట్రంప్ గతంలో హెచ్చరించారు.
అయితే అనంతరం చర్చలకు సిద్ధమని ప్రకటించారు.
ఇదే సమయంలో అమెరికా ఆయుధాల కొరతపై కథనాలు వెలువడిన తర్వాత అమెరికా దాడులకు విరామం ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
మీడియాలో వచ్చిన కథనాలను నిరాధారమన్న పెంటగాన్
అయితే ట్రంప్-హెగ్సెత్ మధ్య విభేదాలు జరిగాయన్న అమెరికా మీడియా కథనాలను వైట్‌హౌస్ పూర్తిగా ఖండించింది.
ఈ వార్తలు వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేసిన వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్, "ఇది పూర్తిగా నకిలీ వార్త. రక్షణ మంత్రి హెగ్సెత్‌పై అధ్యక్షుడు ట్రంప్‌కు సంపూర్ణ విశ్వాసం ఉంది" అని తెలిపారు.
ఇదే విషయాన్ని పెంటగాన్ కూడా పునరుద్ఘాటిస్తూ, మీడియాలో వచ్చిన కథనాలను నిరాధారమని కొట్టిపారేసింది.