Trump: ఇరాన్‌పై అణు బాంబ్..వణుకుపుట్టిస్తున్న ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించిన గడువు ముగిసింది. ఇప్పటికే ఈ రాత్రి నాటికి ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామని ఆయన తుది గడువు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రాత్రి ప్రపంచ చరిత్రలో ఒక కీలక మలుపు కావచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, ఇరాన్‌పై అణు దాడికి సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అణు దాడి చేపట్టే విషయంలో అమెరికా అధ్యక్షుడికి సంపూర్ణ అధికారం ఉండటంతో, దీనికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి.
వివరాలు
ట్రంప్ హెచ్చరిక..
ఇటీవల ట్రంప్ చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ఈ రాత్రికే ఇరాన్ నగరాన్ని అంతమొందిస్తామని ఆయన ప్రకటించడంతో, అణు దాడి జరిగే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌లోని ఖర్గ్ దీవి, ఆయిల్ కేంద్రాలపై అమెరికా దాడుల అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ఉద్రిక్తతకు కారణమైంది. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటివరకు వినియోగించని శక్తివంతమైన ఆయుధాలు అమెరికా వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఇరాన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని, త్వరలోనే యుద్ధం ముగిసే అవకాశం ఉందని తెలిపారు.
వివరాలు
ఏ నిమిషమైనా జరగొచ్చు..
అమెరికా రాజ్యాంగం ప్రకారం అణు దాడికి ఆదేశాలు జారీ చేసే అధికారం కేవలం అధ్యక్షుడికే ఉంటుంది. దీనికోసం "న్యూక్లియర్ ఫుట్‌బాల్"గా పిలువబడే ప్రత్యేక సూట్‌కేస్ ద్వారా ధృవీకరణ కోడ్లు పంపించాల్సి ఉంటుంది. ట్రంప్ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే, ఇరాన్‌పై అణు దాడి చేసే దిశగా అమెరికా ముందుకు సాగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో ఎప్పుడైనా ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
వివరాలు
ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటున్న ఇరాన్
ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కీయన్ కూడా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో, తనతో పాటు సుమారు 14 కోట్ల ఇరాన్ ప్రజలు యుద్ధంలో ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదేవిధంగా ట్రంప్ హెచ్చరికకు ప్రతిస్పందిస్తూ, తమపై దాడి జరిగితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, పశ్చిమాసియాలో వచ్చే కొన్ని గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి.