LOADING...
Donald Trump: మూడోసారి అధ్యక్ష పదవికి సై.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
మూడోసారి అధ్యక్ష పదవికి సై.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

Donald Trump: మూడోసారి అధ్యక్ష పదవికి సై.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరిమితులు ఉన్నప్పటికీ, 2028లో మళ్లీ పోటీ చేయాలన్న ఆలోచనను ఆయన పూర్తిగా తిరస్కరించలేదు. తన మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ చేసిన సూచనపై మీడియా ప్రశ్నించగా, ట్రంప్ స్పందించారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తుండగా జర్నలిస్టులతో మాట్లాడిన ట్రంప్, "మూడోసారి పోటీ చేసే అవకాశం వస్తే నాకది ఎంతో ఇష్టం. ఇంతకుముందెన్నడూ లేనంతగా ప్రజల మద్దతు నాపై ఉంది" అని చెప్పారు. అయితే వెంటనే, "అయితే దానిపై నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తి గరిష్టంగా రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా సేవలందించవచ్చు.

వివరాలు 

ప్రత్యేక ప్రణాళిక సిద్ధమని పాడ్‌కాస్ట్‌లో బానన్ వెల్లడి 

'పొలిటికో' కథనం ప్రకారం, ట్రంప్‌కు సన్నిహితుడైన స్టీవ్ బానన్ మాత్రం ఆయన మూడోసారి పోటీ చేయాలని బలంగా సూచిస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక కూడా సిద్ధమైందని, తన పాడ్‌కాస్ట్‌లో బానన్ వెల్లడించాడు. ఇక రిపబ్లికన్ పార్టీలో తన తర్వాతి నాయకత్వం ఎవరిదో అన్న అంశంపై ట్రంప్ కొంత స్పష్టత ఇచ్చారు. 2028 అధ్యక్ష ఎన్నికల్లో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాన అభ్యర్థులుగా నిలుస్తారని సంకేతాలిచ్చారు. "మన పార్టీలో అద్భుతమైన నాయకులు ఉన్నారు. వారిలో ఒకరు ఇక్కడే ఉన్నారు" అంటూ రూబియో వైపు చూపిస్తూ ట్రంప్ వ్యాఖ్యానించారు. "ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అసాధారణ వ్యక్తి. వీరిద్దరిపై ఎవరూ పోటీ చేయాలనుకోరని నేను నమ్ముతున్నాను" అని తెలిపారు.

వివరాలు 

మలేషియా ప్రజలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్ 

ప్రస్తుతం ట్రంప్ ఆసియా పర్యటనలో ఉన్నారు. మలేషియాలో జరిగిన ఆసియాన్ సదస్సులో పాల్గొని, పర్యటనను విజయవంతంగా ముగించుకున్న అనంతరం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. మలేషియా పర్యటన ముగింపు సందర్భంగా అక్కడి ప్రజలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. "మలేషియా అనే శక్తివంతమైన దేశం నుంచి బయలుదేరుతున్నాను. ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలు, రేర్ ఎర్త్ ఒప్పందాలు కుదిరాయి. అంతేకాదు, థాయిలాండ్-కంబోడియా మధ్య శాంతి ఒప్పందం కుదుర్చడంలో విజయం సాధించాం.ఇక యుద్ధం ఉండదు. లక్షలాది ప్రాణాలను రక్షించగలిగాం. ఇప్పుడు జపాన్‌కు బయలుదేరుతున్నాను" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికలో పోస్టు చేశారు.