Loading...
Trump: ట్రంప్ హెలికాప్టర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గాల్లో విమానంతో దగ్గరగా ఆయన హెలికాప్టర్‌..!
గాల్లో విమానంతో దగ్గరగా ఆయన హెలికాప్టర్‌..!

Trump: ట్రంప్ హెలికాప్టర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గాల్లో విమానంతో దగ్గరగా ఆయన హెలికాప్టర్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న మెరైన్ వన్ హెలికాప్టర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆ హెలికాప్టర్ ఓ ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపానికి వెళ్లడంతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ హెలికాప్టర్‌లో ఉండగా, మరోవైపు ప్రయాణికులతో ఉన్న విమానం కావడంతో ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ గగనతలంలో ఆగస్టు 4న (అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటుచేసుకుంది. మెరైన్ వన్ హెలికాప్టర్, ప్రయాణికుల విమానం మధ్య దూరం ఒక మైలు కంటే కూడా తక్కువగా నమోదైనట్లు సమాచారం. ఎయిర్ ట్రాఫిక్ సిబ్బందితో జరిగిన కమ్యూనికేషన్‌లో లోపాలే ఈ పరిస్థితికి కారణమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

వివరాలు 

NTSB, FAA దర్యాప్తు

రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌ల మధ్య నిర్దేశిత భద్రతా దూరం గణనీయంగా తగ్గిన విషయాన్ని గుర్తించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే పైలట్లను అప్రమత్తం చేశారు.

వారి తక్షణ చర్యలతో రెండు విమానాలు సురక్షిత దూరానికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది.

నిబంధనల ప్రకారం రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌ల మధ్య కనీసం మైలున్నర దూరం తప్పనిసరిగా ఉండాలి.

ఈ ఘటనపై అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించాయి.

వివరాలు 

ట్రంప్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు: వైట్‌హౌస్

ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఏఏ తెలిపింది.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై వైట్‌హౌస్ కూడా స్పందించింది.

మెరైన్ వన్ హెలికాప్టర్లను అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లు నడుపుతారని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేసింది.

ఘటన జరిగిన సమయంలో ట్రంప్ కాలిఫోర్నియాకు ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది.

ADVERTISEMENT