Donald Trump : మరోసారి తెరపైకి అమెరికా '51వ' రాష్ట్రంగా కెనడా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా కెనడాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడా అతిగా డిమాండ్లు చేస్తోందని ఆరోపించిన ట్రంప్.. గతంలో తాను చేసిన '51వ రాష్ట్రం' వ్యాఖ్యలను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ''కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా మారేందుకు అంగీకరించడం లేదు. కానీ అమెరికా రాష్ట్రాలు పొందుతున్న అన్ని ప్రయోజనాలను మాత్రం కోరుకుంటోంది. అంతేకాదు.. గత అనేక సంవత్సరాలుగా అమెరికా రైతులపై కెనడా భారీగా సుంకాలు విధిస్తోంది. ఇకపై అది కుదరదు'' అని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
వివరాలు
అమెరికా విధించిన 50 శాతం టారిఫ్..
అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లకు దీటుగా స్పందిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు.
డాలర్‌కు డాలర్ చొప్పున ప్రతీకార సుంకాలు విధిస్తామని తెలిపారు.
టారిఫ్‌ల విధింపు కెనడాపై జరిగిన దాడి వంటిదేనని ఆయన అభివర్ణించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విఫలం కావడంతో కెనడా నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్‌ను ప్రకటించింది.
ముందుగా కుదిరిన ఒప్పంద నిబంధనల ప్రకారం వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కెనడా నిరాకరించిందని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్ తెలిపారు.
వివరాలు
అమెరికా, కెనడా మధ్య ఆర్థిక సంబంధాలు..
ఉక్కు, అల్యూమినియం వంటి రంగాలపై సుంకాలను తగ్గించేందుకు అమెరికా సిద్ధమైనప్పటికీ.. కెనడా వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
అయితే, చివరి నిమిషంలో అమెరికా నిబంధనలను మార్చడం అన్యాయమని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆరోపించారు.
ఈ నిబంధనలు ఆర్థికంగా కూడా ఆమోదయోగ్యంగా లేవని స్పష్టం చేశారు.
అమెరికా తీసుకుంటున్న చర్యల వల్ల భవిష్యత్‌లో ఏ ఒప్పందంపైనైనా నమ్మకం సడలిపోయే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.
ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు అమెరికా, కెనడా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత సంక్షోభంలోకి నెట్టాయి.
కెనడా తన చర్చల బృందాన్ని వెనక్కి పిలిచింది. మరోవైపు అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా తగిన చర్యలు తీసుకునేందుకు కెనడా సిద్ధమవుతోంది.