
White House: రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ భారత్‌పై సుంకాలు : వైట్ హౌస్
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాను అదుపులోకి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నాడు. దాని భాగంగానే భారత్‌పై భారీ దిగుమతి సుంకాలను విధించనున్నట్టు వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా మాస్కోపై పరోక్ష ఒత్తిడి తీసుకురావాలన్నదే ట్రంప్ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. మంగళవారం వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు 25శాతం ఉన్న సుంకానికి అదనంగా మరో 25శాతం కలిపి,మొత్తం 50శాతం టారిఫ్‌ను భారత్‌పై విధించేలా ట్రంప్ ఆదేశించారని ఆమె తెలిపారు. "ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్నిత్వరగా ముగించేందుకు అధ్యక్షుడు ట్రంప్ గట్టి ఒత్తిడి తీసుకువస్తున్నారు.ఆ దిశగా భారత్‌పై ఆంక్షలు,కొత్త ఆర్థిక చర్యలు అమలు చేస్తున్నారు"అని లెవిట్ వివరించారు.
వివరాలు
యుద్ధాన్ని త్వరగా ముగించాలన్నదే ట్రంప్ లక్ష్యమని వెల్లడి
యుద్ధాన్ని వీలైనంత త్వరగా ఆపేయాలన్నదే ట్రంప్ ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఇటీవలే ట్రంప్,ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో వైట్‌హౌస్‌లో ప్రత్యేకంగా సమావేశమైన విషయాన్ని లెవిట్ గుర్తు చేశారు. అవసరం అనిపిస్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో త్రైపాక్షిక సమావేశానికి కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నారని ఆమె సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ శాంతి కృషికి యూరోపియన్ దేశాలు సానుకూలంగా స్పందిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. దీనికి నిదర్శనంగా, పుతిన్‌తో ట్రంప్ భేటీ అయిన రెండు రోజుల్లోనే యూరోపియన్ నేతలు అందరూ అమెరికాకు వచ్చి అధ్యక్షుడిని కలిసిన విషయాన్ని లెవిట్ ప్రస్తావించారు.
వివరాలు
శాశ్వత శాంతిని నెలకొల్పడమే ట్రంప్ లక్ష్యం
"ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆరంభమయ్యేదే కాదని పుతిన్ చేసిన వ్యాఖ్య నిజమేనా?" అని విలేకరులు ప్రశ్నించగా, దానికి సమాధానంగా "అది వాస్తవమే. ఆ మాటను పుతిన్ స్వయంగా చెప్పారు" అని లెవిట్ సమాధానమిచ్చారు. శాశ్వత శాంతిని నెలకొల్పడమే ట్రంప్ లక్ష్యమని, ఆ దిశగా ఆయన మిత్రదేశాలు, నాటో దేశాలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారని ఆమె అన్నారు. ఈ యుద్ధాన్ని నిలిపివేయడానికి ట్రంప్ తన సమయాన్ని, శక్తిని బహుళంగా వినియోగిస్తున్నారని లెవిట్ స్పష్టం చేశారు.