Donald Trump: ఇరాన్ తీరుపై ట్రంప్ ఫైర్.. 75 వేల మంది మృతిపై కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఘర్షణలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఎనిమిది నెలల కాలంలో ఇరాన్ ప్రభుత్వం 75 వేల మంది నిరసనకారులను హతమార్చిందని ఆయన ఆరోపించారు. అమెరికాలో వచ్చే నెలలో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ఎన్నో హత్యలు జరిగాయి. కనీసం 75 వేల మంది నిరసనకారులను చంపేశారు. అక్కడి ప్రజలు ఎందుకు నిరసనలు చేయడం లేదని కొందరు నన్ను అడిగారు. వీధి చివరన మెషిన్ గన్లతో కాల్పులు జరుపుతుంటే ప్రజలు నిరసనలు చేయడం కష్టమే కదా! అంతేకాదు, చంపేసిన వారిని అందరూ చూసేలా ఇరాన్ ప్రభుత్వం క్రేన్లకు వేలాడదీస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వివరాలు
నాటో దేశాలపైనా విమర్శలు
ఇదే సందర్భంలో ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ (నాటో) సభ్య దేశాలపైనా ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్ యుద్ధంలో సహాయం చేయాలని తాను నాటో దేశాలను కోరినప్పటికీ, వాటి నుంచి సానుకూల స్పందన రాలేదని అన్నారు.
ఇరాన్ యుద్ధంలో సహాయం కావాలని అడిగాను. నిజానికి మనకు ఆ సహాయం అవసరం లేదు. అయితే, ఆ దేశాల వైఖరి ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే సహాయం కోరాను.
వాటిని పరీక్షించాలని అనుకున్నాను. ఎందుకంటే నాటో కోసం మనం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాం.
మనం అంత ఖర్చు పెడుతున్నప్పటికీ, సహాయం అడిగినప్పుడు మాత్రం ఆ దేశాలు 'నో' అని సమాధానం ఇచ్చాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.