Trump: అమెరికా న్యాయ వ్యవస్థ అవినీతిమయంగా మారింది: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశ న్యాయ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన ఆర్థిక విధానాలు,పరిపాలనా నిర్ణయాలకు వ్యతిరేకంగా వరుసగా వెలువడుతున్న కోర్టు తీర్పులపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కెన్నెడీ సెంటర్‌కు సంబంధించిన వివాదం,అలాగే టారిఫ్‌ల అంశంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికా రాజకీయ వ్యవస్థ ఎంతగా అవినీతికి గురైందో, న్యాయ వ్యవస్థ కూడా అదే స్థాయిలో మోసపూరితంగా మారిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల గురించి దేశ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉందని, అందుకే తాను భారీ మెజారిటీతో అధ్యక్ష పదవికి ఎన్నికయ్యానని పేర్కొన్నారు.
వివరాలు
దేశ ప్రయోజనాల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తా: ట్రంప్
దేశ ప్రయోజనాల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో చేసిన పోస్టులో వెల్లడించారు. కెన్నెడీ సెంటర్ వ్యవహారంలో యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి క్రిస్టోఫర్ కూపర్ ఇచ్చిన తీర్పుపైనా ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించిన కూపర్, కెన్నెడీ సెంటర్‌లో చేపట్టాలని భావించిన కొన్ని మార్పులను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే వేసవి కాలంలో విస్తృత స్థాయిలో మరమ్మతులు, నిర్మాణ పనులు చేపట్టేందుకు సాంస్కృతిక కేంద్రాన్ని మూసివేయాలన్న ప్రతిపాదనపై కూడా స్టే విధించారు.
వివరాలు
జడ్జి కూపర్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు: ట్రంప్
ఈ నిర్ణయాలపై స్పందించిన ట్రంప్, జడ్జి కూపర్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. కూపర్ భార్య అమీ జెఫ్రెస్ రాజకీయంగా వామపక్ష భావజాలానికి అనుకూలంగా ఉన్నారని, ఆమె ప్రభావం న్యాయమూర్తి నిర్ణయాలపై పడుతోందని వ్యాఖ్యానించారు. అమీ జెఫ్రెస్ న్యాయవాదిగా పనిచేస్తున్నారని, గతంలో తనకు వ్యతిరేకంగా కేసులు నడిపిన వర్గాలతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని కూడా ట్రంప్ ఆరోపించారు.