Loading...
Trump: అణు డీల్ లేకుండానే ఇరాన్‌తో ఒప్పందానికి ట్రంప్ సిద్ధమవుతున్నారా?
అణు డీల్ లేకుండానే ఇరాన్‌తో ఒప్పందానికి ట్రంప్ సిద్ధమవుతున్నారా?

Trump: అణు డీల్ లేకుండానే ఇరాన్‌తో ఒప్పందానికి ట్రంప్ సిద్ధమవుతున్నారా?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోతుండగా.. మరోవైపు మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలు కూడా ఎటూ తేలడం లేదు. పశ్చిమాసియాలో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధంతో అమెరికాకు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో సొంత దేశంలోనే ట్రంప్‌కు వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌తో యుద్ధం నుంచి బయటపడేందుకు అమెరికా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ట్రంప్ పట్టుబడుతూ వచ్చిన అణు ఒప్పందం అంశాన్ని కూడా పక్కన పెట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

హర్మూజ్ తెరిస్తే ఒప్పందానికి సిద్ధం..

అణు అంశాలను చేర్చకుండానే టెహ్రాన్‌తో ఒప్పందం చేసుకునే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు అమెరికా మీడియా విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సంచలన కథనం ప్రచురించింది.

ఇరాన్ ఎలాంటి షరతులు లేకుండా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచి నౌకల రాకపోకలకు అవకాశం కల్పిస్తే ఆ దేశంతో ఒప్పందం చేసుకోవచ్చని ట్రంప్ తన సన్నిహితులతో ప్రైవేటుగా చెప్పినట్లు సమాచారం.

అణు ఒప్పందం లేకుండానే ప్రస్తుత యుద్ధాన్ని ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అయితే శాంతి ఒప్పందం కోసం ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

మరోవైపు పశ్చిమాసియాలో ఘర్షణలను ఎంతకాలమైనా కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సంకేతాలు ఇచ్చింది.

వివరాలు 

హర్మూజ్ విషయంలో ఇరాన్ డిమాండ్లు..

ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్ అణు డీల్ విషయంలో తన వైఖరిని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తమ డిమాండ్లను అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది.

అమెరికా విధించిన దిగ్బంధనాన్ని వెంటనే తొలగించాలని టెహ్రాన్ కోరుతోంది. అలాగే పశ్చిమాసియా ప్రాంతం నుంచి అమెరికా సైనిక బలగాలు వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తోంది.

యుద్ధానికి శాశ్వతంగా ముగింపు లభించే వరకు హర్మూజ్ జలసంధిని తెరవబోమని కరాఖండీగా చెబుతోంది. ఈ డిమాండ్లే అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు ప్రధాన అడ్డంకులుగా మారాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఎన్నికల ఎఫెక్ట్..

మరోవైపు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబరులో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం కొనసాగుతుండటంతో చమురు ధరలు తగ్గడం లేదు.

ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధం నుంచి బయటపడాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.

అయితే బహిరంగంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి.

తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఇరాన్‌తో చర్చల విషయంలో తొందరేమీ లేదని ట్రంప్ చెప్పారు.

తాము ప్రశాంతంగా ఉన్నామని పేర్కొంటూ.. టెహ్రాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని, ఆ దేశం వద్ద సరిపడా నగదు కూడా లేదని వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

వివరాలు 

అలా చేస్తే తీవ్ర పరిణామాలే: ఇరాన్

మరోవైపు అమెరికాపై ఇరాన్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేసింది.

అమెరికా సిబ్బంది తమ దేశంలోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ బ్రిగేడియర్ జనరల్ అలీ జహన్‌షాహీ హెచ్చరించారు.

ప్రత్యర్థి చర్యలకు తాము గట్టిగా బదులిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మొత్తంగా.. ఇరాన్‌తో యుద్ధం ముగింపు, హర్మూజ్ జలసంధి తెరవడం, అమెరికా దిగ్బంధనాన్ని తొలగించడం, అగ్రరాజ్య సైనిక బలగాల ఉపసంహరణ, అణు ఒప్పందం వంటి అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.

ఈ పరిస్థితుల్లో ట్రంప్ అణు డీల్‌ను పూర్తిగా పక్కనపెట్టి ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంటారా? లేక టెహ్రాన్ డిమాండ్లపై మరిన్ని చర్చలు జరుపుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT