Donald Trump: ఆ రోజు నేను డ్యూటీలో లేను.. నీ అదృష్టం: భారత సంతతి బాలుడితో ట్రంప్ సరదా వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారత సంతతికి చెందిన 10 ఏళ్ల బాలుడి ప్రాణాలను ప్రమాదం నుంచి కాపాడిన 16 ఏళ్ల లైఫ్‌గార్డ్ రైడర్ విలియమ్స్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. బాలుడిని సాహసోపేతంగా రక్షించిన విలియమ్స్‌ను 'నిజమైన హీరో'గా కొనియాడారు. ఈ సందర్భంగా బాలుడు నథానియల్ రాయ్,అతని కుటుంబ సభ్యులతో పాటు లైఫ్‌గార్డ్ విలియమ్స్ కుటుంబాన్ని వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌కు ఆహ్వానించి సత్కరించారు. గత జులై 25న కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్ సమీపంలోని సీబ్రైట్ బీచ్‌లో ఈ ఘటన జరిగింది. నథానియల్ రాయ్ చీలమండల లోతు నీటిలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా బలమైన అలలు అతడిని సముద్రం లోపలికి లాక్కెళ్లాయి. పరిస్థితిని గమనించిన లైఫ్‌గార్డ్ రైడర్ విలియమ్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించాడు.
వివరాలు
వైట్ హౌస్‌కు బాలుడిని, లైఫ్‌గార్డ్‌ను ఆహ్వానించిన అధ్యక్షుడు
వెంటనే సముద్రంలోకి దూకి బాలుడి వద్దకు చేరుకున్నాడు. అనంతరం అతడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు.
బాలుడిని రక్షిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి కూడా వెళ్లింది.
దీంతో ఘటనలో ధైర్యం చూపించిన లైఫ్‌గార్డ్‌తో పాటు ప్రాణాలతో బయటపడిన బాలుడిని వైట్‌హౌస్‌కు ఆహ్వానించాలని ట్రంప్ నిర్ణయించారు.
ఓవల్ ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ బాలుడు నథానియల్ రాయ్‌తో సరదాగా మాట్లాడారు.
''ప్రమాదం నుంచి బయటపడిన నథానియల్ రాయ్‌కు అభినందనలు. నీ జీవితంలో అదృష్టం ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది. ఆ రోజు నేను విధుల్లో లేకపోవడం కూడా నీ అదృష్టమే'' అంటూ చమత్కరించారు.
వివరాలు
లైఫ్‌గార్డ్ నిజమైన హీరో అని కొనియాడిన అమెరికా అధ్యక్షుడు
అనంతరం రైడర్ విలియమ్స్‌ను చూపిస్తూ అతడు నిజమైన హీరో అంటూ ప్రశంసలు కురిపించారు.
తనకు ఎదురైన పరిస్థితిని విలియమ్స్ కూడా వివరించాడు. ప్రమాదకరమైన సమయాల్లో తమకు ఇచ్చిన శిక్షణే సరైన నిర్ణయం తీసుకునేలా చేస్తుందని చెప్పాడు.
బాలుడు నీటిలో చిక్కుకున్న విషయం గుర్తించిన వెంటనే, సాధ్యమైనంత వేగంగా అతడిని నీటి నుంచి బయటకు తీసుకురావడంపైనే తన పూర్తి దృష్టి పెట్టినట్లు తెలిపాడు.
తన కుమారుడి ప్రాణాలను కాపాడిన లైఫ్‌గార్డ్‌లకు నథానియల్ తండ్రి సుమిత్ రాయ్ కృతజ్ఞతలు తెలిపారు.
వివరాలు
లైఫ్‌గార్డ్ ధైర్యసాహసాలకు ప్రశంసలు
ముఖ్యంగా క్లిష్ట సమయంలో ధైర్యంగా స్పందించి తన కుమారుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన విలియమ్స్‌కు ధన్యవాదాలు చెప్పారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో రైడర్ విలియమ్స్ తల్లిదండ్రులు షేన్, షానన్‌తో పాటు బాలుడి రక్షణలో సహకరించిన మరో లైఫ్‌గార్డ్ ఆరోన్ బోనిన్ కూడా పాల్గొన్నారు.
ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే స్పందించి బాలుడిని కాపాడిన యువ లైఫ్‌గార్డ్ ధైర్యసాహసాలను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు.