LOADING...
Donald Trump: ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి నామినేషన్‌.. హంటర్‌ బైడెన్‌ పోస్టు వైరల్
ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి నామినేషన్‌.. హంటర్‌ బైడెన్‌ పోస్టు వైరల్

Donald Trump: ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి నామినేషన్‌.. హంటర్‌ బైడెన్‌ పోస్టు వైరల్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 03, 2026
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆయన రాజకీయ ప్రత్యర్థి హంటర్‌ బైడెన్‌ నోబెల్‌ శాంతి బహుమతి కోసం నామినేషన్‌ చేసినట్లు ప్రకటించారు. అయితే ఇది నిజమైన ప్రతిపాదన కాదని, ట్రంప్‌పై వ్యంగ్యంగా చేసిన పోస్టు అని స్పష్టమవుతోంది. ఈ మేరకు హంటర్‌ బైడెన్‌ ఎక్స్‌ (X) వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

వివరాలు

హంటర్ బైడెన్ ఏం అన్నారంటే?

తన పోస్టులో హంటర్‌ బైడెన్‌ మాట్లాడుతూ.. ''డొనాల్డ్‌ జే ట్రంప్‌ను నోబెల్‌ శాంతి బహుమతికి అధికారికంగా నామినేట్‌ చేస్తున్నాను. చరిత్రలో ఏ అధ్యక్షుడూ ఒకే యుద్ధాన్ని పదేపదే నిలిపివేసిన ఘనత సాధించలేదు. కానీ మన ప్రియమైన నాయకుడు ట్రంప్‌ ఇరాన్‌తో యుద్ధాన్ని సీఎన్‌ఎన్‌ గణాంకాల ప్రకారం ఏకంగా 38 సార్లు ఆపారు. ఇలాంటి రికార్డు గతంలో మరే అధ్యక్షుడి ఖాతాలో లేదు. ఇప్పుడు ఆయన ఆ యుద్ధానికి పూర్తిగా ముగింపు పలికే దశకు కూడా చేరువయ్యారు. కాబట్టి ఈ అసాధారణ ఘనతను నోబెల్‌ కమిటీ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు'' అని వ్యంగ్య ధోరణిలో పేర్కొన్నారు.

వివరాలు

అమెరికా నుంచి ఇద్దరికి నోబెల్ శాంతి బహుమతి..

హంటర్‌ బైడెన్‌ పోస్టు చివరలో ఉపయోగించిన ''ఈ అంశంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు'' అనే వ్యాఖ్య కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ పోస్టులను ఇదే తరహా వాక్యంతో ముగించడం సాధారణంగా కనిపిస్తుంటుంది. జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ట్రంప్‌ తరచూ ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించేవారు. ఈ నేపథ్యంలో హంటర్‌ చేసిన తాజా వ్యంగ్య పోస్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌ అవుతోంది. కాగా, అమెరికా పదవిలో ఉన్న అధ్యక్షుల్లో ఇప్పటివరకు కేవలం ఇద్దరికి మాత్రమే నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. వారిలో వుడ్రో విల్సన్‌ 1920లో, బరాక్‌ ఒబామా 2009లో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.

Advertisement