
White House: వైట్‌హౌజ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. జర్నలిస్టుతో పంచుకున్న యుద్ధ ప్రణాళిక..
ఈ వార్తాకథనం ఏంటి
వైట్‌హౌస్‌లో అధికారుల నిర్లక్ష్యం బయటపడటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పొరపాటున యెమెన్ యుద్ధ ప్రణాళికను ఓ జర్నలిస్టుతో పంచుకున్నారు. అదీ కూడా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారిక ప్రకటన చేయకముందే ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం.
అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర కీలక అధికారులు ఉన్న ఓ గ్రూప్ చాట్‌లోకి ఓ యూఎస్ జర్నలిస్టుకు ప్రవేశాన్ని కల్పించారు.
ఆ గ్రూప్‌లో అతడు ఉన్నాడనే విషయం హౌతీ రెబల్స్‌పై యుద్ధ సమాచారం పోస్ట్ చేసిన తర్వాత బహిరంగమైంది.
'ద అట్లాంటిక్' మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ జెఫ్రీ గోల్డ్‌బర్గ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
వివరాలు
వైట్‌హౌజ్ అధికారులు షాక్
మార్చి 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యెమెన్‌పై దాడులను ప్రకటించారు. అయితే, దానికి ముందే సిగ్నల్ గ్రూప్ చాట్ ద్వారా తనకు ఈ సమాచారం అందిందని జెఫ్రీ గోల్డ్‌బర్గ్ తెలిపారు.
ఈ ఘటన జరగడానికి రెండు రోజులు ముందే ఆయన్ని ఆ గ్రూప్ చాట్‌లో చేర్చారని వెల్లడించారు.
కానీ, ఆయన ఆ సమాచారం బయటపెట్టలేదు. జెఫ్రీ గోల్డ్‌బర్గ్ ప్రకటన తర్వాత వైట్‌హౌజ్ అధికారులు షాక్‌కు గురయ్యారు.
ఈ వ్యవహారంపై విచారణ చేపట్టగా, నిజంగానే పొరపాటు జరిగిందని సోమవారం వైట్‌హౌజ్ వర్గాలు ధృవీకరించాయి.
అయితే, దాడులకు సంబంధించిన పూర్తి ప్రణాళిక అక్కడ వెల్లడించలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ ఘటన ఇప్పుడు అమెరికాలో వేడిచర్చకు దారితీసింది.
వివరాలు
హౌతీలకు ట్రంప్ హెచ్చరిక
ఈ సంఘటన భద్రతా లోపమేనని డెమోక్రాట్లు స్పష్టం చేస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి జాతీయ భద్రతపై నిర్లక్ష్యపూరిత వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు.
దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, యెమెన్ హౌతీలు అమెరికా నౌకలు,విమానాలపై దాడులు చేయడాన్ని ఖండిస్తూ, ట్రంప్ సర్కారు సైనిక చర్యకు ఉపక్రమించింది.
''హౌతీలు, మీ సమయం ఆసన్నమైంది. మీ దాడులు వెంటనే నిలిపివేయాలి. లేనిపక్షంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అంటూ ట్రంప్ హెచ్చరించారు.
వివరాలు
ఇరాన్‌కు కూడా హెచ్చరిక
అంతేకాక, హౌతీలకు మద్దతుగా ఉన్న ఇరాన్‌ను కూడా గట్టిగా హెచ్చరించారు.
మార్చి 15-16 తేదీల నుండి ప్రారంభమైన ఈ దాడులు యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్నాయి.
అయితే, అమెరికా దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు కూడా ఈ దాడులకు ధీటైన ప్రతిస్పందన ఇస్తున్నాయి.