LOADING...
Donald Trump: ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అణు పరీక్షలు తిరిగి ప్రారంభించాలని ఆదేశం!
అణు పరీక్షలు తిరిగి ప్రారంభించాలని ఆదేశం!

Donald Trump: ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అణు పరీక్షలు తిరిగి ప్రారంభించాలని ఆదేశం!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధ పరీక్షలను మళ్లీ ప్రారంభించాలన్న ఆదేశాలు తాను యుద్ధ శాఖకు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్) జారీ చేసినట్టు వెల్లడించారు. రష్యా, చైనా దేశాలు తమ అణు సామర్థ్యాలను వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో వెల్లడించారు.

వివరాలు 

అణ్వాయుధ సామర్థ్యంలో రష్యా రెండో స్థానం

"ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే అమెరికా వద్ద అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి. నా మొదటి అధ్యక్ష పదవీకాలంలోనే దీన్ని సాధించాం.ఇవి అత్యంత విధ్వంసకర శక్తిని కలిగి ఉన్నందున,నేను ఇంతకాలం దీనిపై ముందడుగు వేయలేదు. కానీ ఇప్పుడు వేరే మార్గం లేదు. ప్రస్తుతం రష్యా అణ్వాయుధ సామర్థ్యంలో రెండో స్థానంలో ఉంది,చైనా మూడో స్థానంలో ఉంది. ఐదేళ్లలోపు ఈ దేశాలు అమెరికాకు సమానంగా మారే అవకాశం ఉంది. అందువల్లనే యుద్ధ శాఖను వెంటనే అణ్వాయుధ పరీక్షలను పునఃప్రారంభించాలని ఆదేశించాను. ఈ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుంది,"అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా,రష్యా తన ఆయుధ ఉత్పత్తి విస్తరణకు వేగం పెంచింది. ముఖ్యమైన ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి వైదొలిగి,అధునాతన అణు సామర్థ్యాల అభివృద్ధిపై దృష్టి సారించింది

వివరాలు 

ట్రంప్ ఆదేశాలపై స్పందించని పెంటగాన్ 

అణుశక్తితో నడిచే సబ్‌మెర్సిబుల్ డ్రోన్ 'పోసిడాన్'ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ప్రకటించారు. ఇదే సమయంలో చైనా కూడా తన అణు ఆయుధ భాండాగారాన్ని వేగంగా పెంచుతోంది. మరో ఐదేళ్లలో చైనా అణు సామర్థ్యాలు అమెరికా, రష్యా స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరించాయి. అంతేకాకుండా, ట్రంప్ ఈ ప్రకటనను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో జరగనున్న సమావేశానికి కొన్ని గంటల ముందే చేయడం విశేషంగా మారింది. అయితే ట్రంప్ ఆదేశాలపై పెంటగాన్ (Pentagon) ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.