LOADING...
Travel Ban: అమెరికా కొత్త రూల్స్: ట్రావెల్ బ్యాన్ జాబితా దేశాలకు గ్రీన్ కార్డ్ దూరం
అమెరికా కొత్త రూల్స్: ట్రావెల్ బ్యాన్ జాబితా దేశాలకు గ్రీన్ కార్డ్ దూరం

Travel Ban: అమెరికా కొత్త రూల్స్: ట్రావెల్ బ్యాన్ జాబితా దేశాలకు గ్రీన్ కార్డ్ దూరం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినం చేసే దిశగా మరో అడుగు వేసేలా కనిపిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన వివరాల ప్రకారం, ట్రావెల్ బ్యాన్‌లో ఉన్న దేశాల పౌరులకు గ్రీన్ కార్డు పొందడం ఇంకా కష్టంగా మారేలా ఒక కొత్త ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ అంతర్గత పత్రాల్లో ఉన్న వివరాల ప్రకారం, ట్రావెల్ బ్యాన్‌లో ఉన్న దేశాలకు సంబంధించిన "కంట్రీ స్పెసిఫిక్ ఫ్యాక్టర్లు"ను గ్రీన్ కార్డ్ పరిశీలనలో "ప్రధాన నెగటివ్ అంశం"గా పరిగణించాలని USCIS‌కు సూచించినట్టు తెలుస్తోంది. అంటే, ఎవరు ట్రావెల్ బ్యాన్‌లో ఉన్న దేశానికి చెందినవారైతే, ఆ దేశం నుంచే వచ్చారన్న కారణమే వారి అప్లికేషన్‌కి ప్రతికూలంగా నమోదు అయ్యే అవకాశం ఉంది.

వివరాలు 

ఈ మార్పును ఎందుకు ఆలోచిస్తున్నారు? 

అమెరికా అధికారుల మాటల్లో,కొన్ని దేశాల్లో వ్యక్తుల ఐడెంటిటీని నిర్ధారించడానికి సరైన వ్యవస్థలు లేవని, బ్యాక్‌గ్రౌండ్ చెక్ కోసం అవసరమైన సమాచారాన్ని వారు పంచుకోవడం లేదని అంటున్నారు. కొంతమంది దేశాల్లో పాస్‌పోర్ట్‌లు,ఐడెంటిటీ పత్రాలు జారీ చేసే అధికార యంత్రాంగాలు నమ్మదగిన రీతిలో పనిచేయడం లేదని కూడా పేర్కొంటున్నారు. ఈ కారణంగా ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలకు అర్హతను నిర్థారించడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. బౌల్డర్,కొలరాడోలో జరిగిన దాడిని ఉదహరిస్తూ,తగిన వెరిఫికేషన్ లేకుండా అమెరికాలోకి ప్రవేశించే వ్యక్తుల వల్ల దేశ భద్రతకు ముప్పు పెరుగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఆలోచనను సమర్థించారు. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే,గ్రీన్ కార్డ్‌తో పాటు ఆశ్రయం (అసైలం),పరోల్,మరికొన్ని ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, అమెరికా పౌరసత్వానికి చేసే అప్లికేషన్లకు ఇది వర్తించదు.

వివరాలు 

ట్రావెల్ బ్యాన్ జాబితాలో 12 దేశాలు

అమెరికా ట్రావెల్ బ్యాన్ జాబితాలో ప్రస్తుతం మొత్తం 12 దేశాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఛాద్, కాన్గో రిపబ్లిక్, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైటి, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్. వీటితో పాటు బురుండీ, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్తాన్, వెనిజులా వంటి మరో 7 దేశాల పౌరులు శాశ్వతంగా అమెరికాలో స్థిరపడటం, టూరిస్ట్ లేదా స్టూడెంట్ వీసాలు పొందడం కూడా ప్రస్తుతం పరిమితం చేయబడ్డాయి. ఇంకా, ఈ పరిమితులు దేశానికిదేశం భిన్నంగా ఉన్నప్పటికీ, ఇవన్నీ ట్రావెల్-బ్యాన్ విధానంలోని వేర్వేరు శ్రేణులు.

వివరాలు 

వీరికి ఆంక్షలు వర్తించవు

ఈ నిబంధనల్లో కూడా మినహాయింపులు ఉన్నాయి. ఇప్పటికే చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్నవారికి, లా-ఫుల్ పర్మినెంట్ రెసిడెంట్స్‌కి (అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్లు) ఆంక్షలు వర్తించవు. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో పాల్గొనే అథ్లెట్లకు, కొందరు ప్రత్యేక ఇమ్మిగ్రంట్ వీసాలకు అర్హత పొందిన అఫ్ఘాన్ పౌరులకు కూడా మినహాయింపు ఉంది. ఇరాన్ విషయంలో, కొందరు మత, వర్గ పరమైన మైనారిటీలకు కూడా అమెరికా అధికారులు ప్రత్యేక అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది.

వివరాలు 

తీవ్రమైన విధాన మార్పు

ఈ ప్రతిపాదనపై విమర్శలు కూడా విస్తరించాయి. జో బైడెన్ ప్రభుత్వంలో పనిచేసిన మాజీ అధికారులు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు.. వ్యక్తుల వ్యక్తిగత అర్హతల కంటే వారు వచ్చిన దేశాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకోవడం అన్యాయమని అంటున్నారు. USCIS మాజీ అధికారిని డగ్ రాండ్ ఈ మార్పుని "తీవ్రమైన విధాన మార్పు"గా పేర్కొంటూ, అమెరికాలో ఇప్పటికే ఉన్న వ్యక్తులకు కూడా ఇది ఇబ్బందులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని అన్నారు. మరో మాజీ పాలసీ అనలిస్ట్ సారా పియర్స్ మాటల్లో, ఈ విధానం ఖచ్చితంగా తిరస్కరణల సంఖ్య పెంచుతుందని, దేశం ఆధారంగా ముందే నెగెటివ్‌గా నిర్ణయించడం న్యాయపరమైన సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరించారు.