Venezuela As '51st State': వెనిజులాను 51వ రాష్ట్రంగా చూపిస్తూ ట్రంప్ పోస్టు.. ఖండించిన డెల్సీ రోడ్రిగ్జ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదంలో నిలిచారు. తన సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్ సోషల్'లో వెనిజులాను అమెరికా 51వ రాష్ట్రంగా చూపిస్తూ ఆయన చేసిన పోస్టు చర్చనీయాంశమైంది. ఈ పోస్టుతో పాటు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో చిత్రాన్ని కూడా ట్రంప్ పంచుకున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన ధరించినట్లే కనిపించే దుస్తుల్లో రూబియో ఉన్న చిత్రాన్ని ట్రంప్ ప్రచురించారు. అలాగే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో రూబియో ప్రయాణిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.
వివరాలు
వెనిజులా ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా 51వ రాష్ట్రంగా మారదు: డెల్సీ రోడ్రిగ్జ్
ఇదిలా ఉండగా ట్రంప్ చైనా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనకు ముందు ఆయన చేసిన ఈ పోస్టు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. వైట్‌హౌస్ కూడా అదే చిత్రాలను తన ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది. ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెనిజులాను అమెరికా కొత్త రాష్ట్రంగా పరిగణించే ఆలోచన ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కారకాస్‌లో నిర్వహించిన సైనిక చర్యలో మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్న ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ట్రంప్ పోస్టుపై వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెనిజులా ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా 51వ రాష్ట్రంగా మారదని ఆమె స్పష్టం చేశారు.