LOADING...
Donald Trump: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు.. గాజా శాంతి ఒప్పందం తర్వాత ఈజిప్టులో కీలక వ్యాఖ్యలు
గాజా శాంతి ఒప్పందం తర్వాత ఈజిప్టులో కీలక వ్యాఖ్యలు

Donald Trump: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు.. గాజా శాంతి ఒప్పందం తర్వాత ఈజిప్టులో కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2025
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీని తనకు ఎంతో సన్నిహిత స్నేహితుడిగా పేర్కొంటూ, ఆయన అద్భుతమైన నాయకుడని ప్రశంసించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముగింపు పలికే చారిత్రాత్మక గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన అనంతరం ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్‌లో సోమవారం మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. "భారత్ ఒక గొప్ప దేశం. ఆ దేశానికి నా స్నేహితుడు నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చేస్తున్న పని నిజంగా అద్భుతం," అని ట్రంప్ పేర్కొన్నారు.

వివరాలు 

భారత్‌లో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ పర్యటన 

ఇటీవల ప్రధాని మోదీ,ట్రంప్‌తో ఫోన్ సంభాషణ జరిపిన కొన్ని రోజులకే ట్రంప్ చేసిన ఈ ప్రశంసలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గాజా శాంతి ఒప్పందం విజయవంతంగా కుదిరినందుకు మోదీ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని గతవారం ప్రధాని మోదీ'ఎక్స్' ద్వారా వెల్లడించారు.ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో వాణిజ్య చర్చల్లో సాధించిన పురోగతిపై సమీక్ష జరిపినట్టు కూడా మోదీ పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో ఇరు నేతలు ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇది రెండోసారి. ఇదిలా ఉండగా,అమెరికా కొత్త రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ,విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లను కలుసుకున్నారు.

వివరాలు 

మోదీకి ట్రంప్ సంతకంతో కూడిన ఫొటో బహుమతి 

శనివారం మోదీని భేటీ అయినప్పుడు,ఈ ఏడాది ఫిబ్రవరిలో వైట్ హౌస్‌లో ఇద్దరూ కలుసుకున్న సందర్భంలో తీసిన ఫొటోను గోర్ బహుమతిగా అందించారు. ఆఫొటోపై ట్రంప్ స్వయంగా సంతకం చేస్తూ "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్,యూ ఆర్ గ్రేట్!"అని రాశారు. ట్రంప్,మోదీల బలమైన నాయకత్వం కారణంగా ఇరు దేశాల మధ్య రక్షణ,వాణిజ్యం,సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని గోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్,మోదీని తన వ్యక్తిగత స్నేహితుడిగా ఎంతో గౌరవంగా భావిస్తున్నారని ఆయన చెప్పారు. భారత్‌తో అమెరికా సంబంధాలు రాబోయే నెలల్లో మరింత బలపడతాయని గోర్ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొనగా,దీనికి స్పందించిన ప్రధాని మోదీ ఆయన నియామకం ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇంకా బలపరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.