LOADING...
Trump: అలాస్కా వేదికగా ట్రంప్-పుతిన్ భేటీ.. శాంతి ఒప్పందం నిమిషాల్లో తేలుతుందన్న ట్రంప్ ధీమా!
అలాస్కా వేదికగా ట్రంప్-పుతిన్ భేటీ.. శాంతి ఒప్పందం నిమిషాల్లో తేలుతుందన్న ట్రంప్ ధీమా!

Trump: అలాస్కా వేదికగా ట్రంప్-పుతిన్ భేటీ.. శాంతి ఒప్పందం నిమిషాల్లో తేలుతుందన్న ట్రంప్ ధీమా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 12, 2025
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అలాస్కా వేదికగా సమావేశం కానున్నారు. ఈ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శ్రమిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు చర్చలు ఫలించలేదు. ఇప్పుడు స్వయంగా ట్రంప్‌ రంగంలోకి దిగుతూ,శాంతి ఒప్పందం సాధ్యమవుతుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. తాజాగా ఈఅంశంపై వైట్‌ హౌస్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌, పుతిన్‌తో శాంతి ఒప్పందం సాధ్యమవుతుందా కాదా అన్నది సమావేశం మొదటి రెండు నిమిషాల్లోనే తనకు తెలుస్తుందని అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ శాంతి ఒప్పందం కోసం ఆగస్టు 15న పుతిన్‌తో భేటీ అవుతున్నానని, ఈప్రక్రియ త్వరగా ముగుస్తుందని,ఒప్పందం కుదురుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు.

Details

పుతిన్ అమెరికాకు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా

"ముందుగానే మీకు ఎలా తెలుస్తుంది?" అని రిపోర్టర్‌ అడగగా, "ఎందుకంటే నేను చేసేది అదే - నేను ఒప్పందాలు కుదురుస్తాను" అని ట్రంప్‌ సమాధానమిచ్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌కు చెబుతానని, నిర్మాణాత్మక సంభాషణలు జరపాలనుకుంటున్నానని అన్నారు. పుతిన్‌ అమెరికాకు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని కూడా ట్రంప్‌ తెలిపారు. అలాగే, తదుపరి సమావేశం తాను, పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య త్రైపాక్షికంగా జరిగే అవకాశం ఉందని ట్రంప్‌ వెల్లడించారు. జెలెన్‌స్కీ-పుతిన్‌ మధ్య సమావేశం జరిగితే వారితో తాను కూర్చుంటానని, ఇద్దరి మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని కానీ అది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.