LOADING...
Trump- Putin meeting: ట్రంప్‌-పుతిన్‌ సమావేశం వాయిదా
ట్రంప్‌-పుతిన్‌ సమావేశం వాయిదా

Trump- Putin meeting: ట్రంప్‌-పుతిన్‌ సమావేశం వాయిదా

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2025
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) మరోసారి భేటీ అవ్వడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హంగరీ రాజధాని బుడాపెస్ట్‌ (Budapest) ఈ కీలక సమావేశానికి వేదికగా నిర్ణయించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సమావేశం వాయిదా పడే అవకాశం ఉందని అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి ముందు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో (Marco Rubio), సెర్గీ లావ్రోవ్‌(Sergey Lavrov) భేటీ కావాల్సి ఉంది. కానీ ఈ సమావేశం నిరవధికంగా వాయిదా పడిందని వైట్‌హౌస్‌ వర్గాలు స్పష్టం చేశాయి. అధ్యక్షుల సమావేశానికి ముందు నిర్మాణాత్మక చర్చలు జరపాలనే ఉద్దేశంతో ఈ భేటీని ప్లాన్‌ చేసినట్లు రష్యా పేర్కొంది.

Details

రద్దుకు గల కారణాలు తెలియరాలేదు

అయితే ఈ సమావేశం రద్దు కావడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇదే సమయంలో రూబియో, లావ్రోవ్‌ సోమవారం ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఉక్రెయిన్‌ యుద్ధానికి శాశ్వత పరిష్కారం కోసం అమెరికా-రష్యా మధ్య సహకారం అవసరమని రూబియో పేర్కొన్నట్లు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. కానీ ఉక్రెయిన్‌ వివాదం శాంతియుత పరిష్కారం విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌-పుతిన్‌ భేటీపై రూబియో సిఫార్సు చేసేందుకు కొంత అయిష్టంగా ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వారంలోనే ఇరుదేశాల విదేశాంగ మంత్రులు మరోసారి మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్‌కాల్‌పై క్రెమ్లిన్‌ కూడా స్పందించింది.

Details

ట్రంప్ కృషికి ఇప్పటివరకు ఫలితం లేదు

ట్రంప్‌-పుతిన్‌ల భేటీకి సంబంధించి మంత్రుల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పేర్కొంది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడానికి ట్రంప్‌ చేస్తున్న కృషి ఇప్పటివరకు ఫలితం ఇవ్వలేదని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ట్రంప్‌ రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులతో ప్రత్యేకంగా చర్చించినప్పటికీ పెద్ద పురోగతి లేదని తెలిపారు. ఇటీవల పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌, హంగరీలో భేటీ అవ్వాలని నిర్ణయించారు. ఈ సంభాషణ జరిగిన మరుసటి రోజే ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy)తో సమావేశమయ్యారు. ఆ చర్చలు సానుకూలంగా ముగిశాయని ట్రంప్‌ పేర్కొన్నారు.