LOADING...
Donald trump: అమెరికా పౌరులు కానివారి పిల్లలకు పౌరసత్వం రద్దు.. ట్రంప్‌ సంతకం చేయనున్న కీలక ఆదేశాలివే?
అమెరికా పౌరులు కానివారి పిల్లలకు పౌరసత్వం రద్దు.. ట్రంప్‌ సంతకం చేయనున్న కీలక ఆదేశాలివే?

Donald trump: అమెరికా పౌరులు కానివారి పిల్లలకు పౌరసత్వం రద్దు.. ట్రంప్‌ సంతకం చేయనున్న కీలక ఆదేశాలివే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ అనేక కార్యనిర్వాహక ఆదేశాలు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) జారీ చేయనున్నారని సమాచారం. పలు ఆదేశాలు ఇప్పటికే ఆయన సంతకం కోసం సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. అమెరికా పౌరులుగా లేని వారికి ఈ గడ్డపై జన్మించిన పిల్లలకు సహజసిద్ధంగా వచ్చే పౌరసత్వం రద్దు చేయడం,అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకోవడం,చమురు,సహజవాయు ఉత్పత్తిపై ఉన్న ఆంక్షలను తొలగించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కీలక మార్పులకు ఇది సూచనగా కనిపిస్తోంది. ఈ విధాన మార్పులకు అనుగుణంగా ట్రంప్ అనేక కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయనున్నారని, శ్వేతసౌధంలో ఆయనకు సహాయకుడిగా పనిచేస్తున్న ఓ అధికారి వెల్లడించారు.

వివరాలు 

న్యాయపరమైన చిక్కులు తప్పవు 

అమెరికాలో ఆశ్రయం ఇవ్వడాన్ని, అలాగే అమెరికాలో పుట్టిన వారికి సహజసిద్ధంగా పౌరసత్వం అందించే విధానాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలు ఇవ్వనున్నారని ఆ అధికారి స్పష్టం చేశారు. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికి సహజంగా దేశ పౌరసత్వం ఇవ్వడం దశాబ్దాలుగా అమలులో ఉన్న విధానం. ఈ విధానం ప్రకారం అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలు, టూరిస్టు లేదా స్టూడెంట్‌ వీసాలపై వచ్చిన వారికి పుట్టిన పిల్లలకు కూడా పౌరసత్వం వర్తిస్తుంది. అయితే, ఈ విధానాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు చేయడం న్యాయపరమైన సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.

వివరాలు 

శరణార్థులకు స్వస్తి 

శరణార్థులకు ఆశ్రయం కల్పించే విధానానికి ట్రంప్‌ తన తిరస్కారాన్ని తెలుపుతున్నారు. ఈ విధానాన్ని తాత్కాలికంగా నాలుగు నెలల పాటు నిలిపివేయాలని యోచిస్తున్నారు. గతంలో అనేక దశాబ్దాలుగా లక్షల మంది శరణార్థులు అమెరికాలో ఆశ్రయం పొందినప్పటికీ, ట్రంప్‌ తన మొదటి పాలనాకాలంలో శరణార్థుల ప్రవేశాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత శరణార్థుల సంఖ్యను భారీగా తగ్గించారని తెలుస్తోంది. అదనంగా, పట్టుబడిన చొరబాటుదారులను అమెరికాలోనే వదిలివేయడం వంటి విధానాలకు కూడా ముగింపు పలకనున్నారు.

వివరాలు 

ఆర్థికం

చమురు,సహజ వాయు ఉత్పత్తులపై ఉన్న నియంత్రణలను ట్రంప్‌ సడలించేందుకు సిద్ధమవుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో భాగంగా ఓ మెమొరాండంపై సంతకం చేయనున్నట్లు సమాచారం. అంతేకాక, చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాల ఉత్పత్తులపై పన్నుల అంశాన్ని పక్కనపెట్టే అవకాశం ఉంది. వైవిధ్యానికి స్వస్తి ట్రాన్స్‌జెండర్లకు ఇస్తున్న రక్షణలను ట్రంప్‌ ఉపసంహరించనున్నారు. లైంగిక వైవిధ్యానికి, సమానత్వానికి సంబంధించి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్త్రీ, పురుష లింగాలను మాత్రమే ప్రభుత్వం గుర్తించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.