Trump Daughter Tiffany: ట్రంప్ కుమార్తె టిఫానీ భారత్‌లో సందడి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె దిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె ప్రముఖ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని శిల్పకళా వైభవాన్ని చూసి టిఫానీ అబ్బురపడ్డారని సమాచారం. అలాగే ఆలయ ఆవరణలో ఉన్న 108 అడుగుల ఎత్తైన నీలకంఠ్ వర్ణీ విగ్రహాన్ని కూడా ఆమె సందర్శించారు. ఈ సందర్శనకు సంబంధించిన ఫొటోలను టిఫానీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. తన పర్యటనలో భాగంగా టిఫానీ ఆగ్రా వెళ్లి ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్‌ను సందర్శించనున్నారు.
వివరాలు
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు
అనంతరం రాజస్థాన్‌లోని జైసల్మేర్ పర్యటన కూడా చేయనున్నట్లు సమాచారం. ఇది వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ, ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, టిఫానీ ట్రంప్ భారత్‌కు రావడం ఇది మొదటిసారి కాదు. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక భారత్ పర్యటన సమయంలో ఆమె కూడా తండ్రితో కలిసి భారత్‌ను సందర్శించారు. టిఫానీ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ రెండో భార్య మార్లా మ్యాపిల్స్ కుమార్తె అన్న విషయం తెలిసిందే.