Donald Trump: ట్రంప్ మాస్టర్ స్ట్రోక్.. డాలర్ దెబ్బతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి!
ఈ వార్తాకథనం ఏంటి
బాంబులు, క్షిపణులతో దాడులు చేయడమే కాకుండా.. ఇప్పుడు డాలర్‌ను కూడా ఆయుధంగా మార్చుకుని ఇరాన్‌ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేయాలని అమెరికా వ్యూహం రచిస్తోంది. ఇరాన్‌కు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈజిప్ట్‌కు చెందిన బాంక్ మిసర్ యూఏఈ శాఖలపై అమెరికా ట్రెజరీ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆ బ్యాంకు శాఖలకు అమెరికా ఆర్థిక వ్యవస్థతో ఉన్న డాలర్ లావాదేవీల మార్గాన్ని కట్ చేసే ప్రతిపాదన చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో ఇరాన్‌కు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసే ప్రయత్నం మరింత ముమ్మరమైంది.
వివరాలు
103 సంస్థల కోసం ప్రాసెస్ చేసింది
2024 జనవరి నుంచి 2026 జూన్ వరకు బాంక్ మిసర్ యూఏఈ సుమారు 1.8 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలను ఇరాన్ షాడో బ్యాంకింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న 103 సంస్థల కోసం ప్రాసెస్ చేసిందని అమెరికా ఆరోపిస్తోంది.
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
ఇరాన్‌కు సహకరించే సంస్థలు అమెరికా డాలర్‌తో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశాన్ని కోల్పోతాయని ఆయన హెచ్చరించారు.
ఈ చర్యను 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్'లో భాగంగా చేపట్టినట్లు అమెరికా తెలిపింది. అయితే బాంక్ మిసర్‌పై ప్రతిపాదించిన చర్య వెంటనే పూర్తిస్థాయిలో అమల్లోకి రాదు.
వివరాలు
ఈజిప్ట్‌కు షాక్..
ప్రతిపాదిత నిబంధనపై 30 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అమెరికా ప్రతిపాదనపై ఈజిప్ట్ స్పందించింది. ఈ చర్య యూఏఈలోని బాంక్ మిసర్ శాఖలు, వాటి డాలర్ లావాదేవీలకు మాత్రమే పరిమితమవుతుందని స్పష్టం చేసింది.
ఈజిప్ట్‌లో బ్యాంక్ నిర్వహించే కార్యకలాపాలకు ఇది వర్తించదని తెలిపింది. మరోవైపు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ కూడా బాంక్ మిసర్ శాఖల లావాదేవీలపై ప్రత్యేక, అత్యవసర పరిశీలనను ప్రారంభించింది.
వివరాలు
ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి మరింత తీవ్రం
ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి ఇప్పుడు సరికొత్త దశకు చేరుకుంది.
ఇరాన్‌కు నిధులు చేరే మార్గాలను కట్ చేయడం, ఆ దేశాన్ని డాలర్ వ్యవస్థకు దూరం చేయడం, ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు కలిగిన భాగస్వాములపై కూడా ఒత్తిడి పెంచడం ద్వారా టెహ్రాన్‌ను అంతర్జాతీయంగా ఆర్థికంగా ఏకాకిని చేయాలని వాషింగ్టన్ ప్రయత్నిస్తోంది.
బాంక్ మిసర్ యూఏఈ శాఖలపై తాజాగా ప్రతిపాదించిన చర్య కూడా ఈ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది.
మొత్తంగా ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి ఇప్పుడు మరో ఫ్రంట్‌కు చేరినట్లైంది. ఒకవైపు ఆయుధాలతో యుద్ధం కొనసాగిస్తూనే.. మరోవైపు డాలర్‌ను ఆర్థిక ఆయుధంగా ఉపయోగించి ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై గట్టి దెబ్బ కొట్టేందుకు అమెరికా సిద్ధమవుతోంది.