
Trump tariffs: ద్రవ్యోల్బణంతో ఇబ్బందిపడుతోన్న అమెరికా.. ట్రంప్ టారిఫ్ ప్రకటనతో మాంద్యంలోకి..
ఈ వార్తాకథనం ఏంటి
అన్‌ప్రిడిక్టబుల్.. ఈ పదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అచ్చంగా సరిపోతుంది.
ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి సుంకాలు విధిస్తూ, వెనక్కి తగ్గుతూ, శత్రువులు, మిత్రుల జాబితాను మారుస్తూ రోజుకో కొత్త నిర్ణయం తీసుకుంటున్నారు.
ట్రంప్ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయని, కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి సమయంలో అందరూ ఊహించినదానికంటే ఎక్కువ టారిఫ్‌లు ప్రకటించి ట్రంప్ సంచలనం సృష్టించారు.
దీని ప్రభావంతో వినియోగ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్యలు తలెత్తుతాయనే భయాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా సహా అన్ని ప్రధాన మార్కెట్లు పడిపోతున్నాయి.
వివరాలు
పెట్టుబడిదారుల ఆందోళన
"అమెరికా గ్రేట్ అగైన్" నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ నుంచి వృద్ధి అనుకూల విధానాలపై ప్రకటనలు వస్తాయని పెట్టుబడిదారులు ఆశించారు. కానీ, టారిఫ్ హెచ్చరికలతో వారిలో ఆందోళన మొదలైంది. తాజా ప్రకటనతో మరింత అయోమయంలో పడిపోయారు.
"ఈ ప్రకటన మార్కెట్లకు తీవ్రమైన ప్రతికూలత కలిగించవచ్చు. ఇది అమెరికాను మాంద్యంలోకి నెట్టవచ్చు. అందుకే ఫ్యూచర్స్ మార్కెట్లు బలహీనంగా మారాయి" అని క్యాపిటల్ మార్కెట్ కంపెనీ 'ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ క్యాపిటల్ అడ్వైజర్స్' సీఈఓ జేహాట్‌ఫీల్డ్ పేర్కొన్నారు.
వివరాలు
వినియోగదారులకు నష్టం
"ఈ మొత్తం పరిణామాల్లో మనం కేవలం ఒక కోణాన్ని మాత్రమే గమనిస్తున్నాం.కానీ,ఇతర దేశాలు దీని గురించి ఎలా స్పందిస్తాయన్నది ముఖ్యం.మార్కెట్ ఈ పరిస్థితిని ఎలా స్వీకరిస్తుందో చూడాలి" అని గ్రీన్‌వుడ్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ వాల్టర్ టాడ్ అభిప్రాయపడ్డారు.
"ప్రస్తుత పరిస్థితి మాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇది లేదా త్వరితగతిన కోలుకునే అవకాశం లేకుండా బ్రేక్‌డౌన్‌కు దారి తీస్తుంది" అని ఇంటరాక్టివ్ బ్రోకర్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ సోస్‌నిక్ విశ్లేషించారు.
ట్రంప్ టారిఫ్ హెచ్చరికల కారణంగా అమెరికాకే నష్టం జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధించడం వల్ల వాటి ధరలు పెరిగి, చివరికి అమెరికా ప్రజలకే ఆర్థిక భారం పడుతుందనే భయం నెలకొంది.
వివరాలు
అంతర్జాతీయ వ్యతిరేకత
తాజాగా ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న వాదనను ట్రంప్ కొట్టిపారేశారు.
అయితే, ఆర్థిక మాంద్యం వస్తుందని కొన్ని అంచనాలు చెబుతున్నా, వాటిని పూర్తిగా తోసిపుచ్చలేదు. కానీ, ఈ చర్యలు అమెరికా ప్రయోజనాలకే ఉపయుక్తమని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ టారిఫ్‌లపై అమెరికాలోనే కాకుండా విదేశాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కానీ,ట్రంప్ మాత్రం తన నిర్ణయాలను కొనసాగిస్తున్నారు.చైనా, వియత్నాం,మెక్సికో,తైవాన్, జపాన్, కెనడా, దక్షిణ కొరియా, ఇండియా, థాయ్‌లాండ్ వంటి దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్‌తోనూ అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉంది.
దీనిని తగ్గించేందుకు ట్రంప్ దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తూ, అమెరికాకు అదనపు ఆదాయం సమకూర్చాలని యత్నిస్తున్నారు.
తన ఎన్నికల హామీ అయిన పన్నుల కోతను అమలు చేయడానికి ఈ ఆదాయాన్ని వినియోగించాలని ఆయన భావిస్తున్నారు.