LOADING...
Donald Trump: నోబెల్‌ ఇవ్వలేదని అసహనం.. నార్వే, నాటోకు ట్రంప్‌ సంచలన సందేశం
నోబెల్‌ ఇవ్వలేదని అసహనం.. నార్వే, నాటోకు ట్రంప్‌ సంచలన సందేశం

Donald Trump: నోబెల్‌ ఇవ్వలేదని అసహనం.. నార్వే, నాటోకు ట్రంప్‌ సంచలన సందేశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2026
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌కు(Jonas Gahr Støre) సంచలన లేఖ రాసినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. నోబెల్ శాంతి బహుమతిని తనకు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇకపై తాను కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన బాధ్యత తనపై లేదని ట్రంప్‌ ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ లేఖ ప్రామాణికతను తాము నిర్ధారించలేకపోయామని 'లైవ్‌మింట్‌' స్పష్టం చేసింది. ఈ లేఖను అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సిబ్బంది వాషింగ్టన్‌లోని పలువురు యూరోపియన్ రాయబారులకు పంపినట్లు తెలుస్తోంది. 'న్యూస్ అవర్స్' కు చెందిన ఓ రిపోర్టర్ ఈ లేఖ ప్రతిని పలువురు అధికారుల నుంచి పొందినట్లు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు.

Details

ఎనిమిది యుద్ధాలు ఆపినా శాంతి బహుమతి ఇవ్వలేదు

ఆర్‌టీ న్యూస్‌, పీబీఎస్ న్యూస్‌ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ లేఖపై కథనాలు ప్రచురించాయి. లేఖలో ట్రంప్‌ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడాన్ని గ్రీన్‌లాండ్ అంశంతో అనుసంధానించినట్లు సమాచారం. ఎనిమిది యుద్ధాలను ఆపినప్పటికీ నార్వే నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. అందుకే ఇకపై నేను కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. అయితే, శాంతి నా ఆలోచనల్లో ప్రాధాన్యతగా ఉంటుంది. అదే సమయంలో అమెరికాకు ఏది మంచిదో కూడా ఆలోచించగలనని లేఖలో పేర్కొన్నట్లు కథనాలు తెలిపాయి. ఇక గ్రీన్‌లాండ్ విషయానికి వస్తే.. "డెన్మార్క్‌ ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా నుంచి రక్షించలేరు.

Details

రాతపూర్వక ఆధారాలు లేవు

గ్రీన్‌లాండ్‌పై వారికి యాజమాన్య హక్కు ఎందుకు ఉండాలి? వందల ఏళ్ల క్రితం ఓ పడవ అక్కడికి వెళ్లిందని చెప్పడమే తప్ప, రాతపూర్వక ఆధారాలు లేవు. మాకూ అప్పట్లో అక్కడికి పడవలు వెళ్లాయని ట్రంప్‌ లేఖలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. నాటోను ఉద్దేశించి కూడా ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. "నాటో స్థాపన నాటి నుంచి దాని కోసం నేను చేసినంత పని మరెవ్వరూ చేయలేదు. ఇప్పుడు నాటో కూడా అమెరికా కోసం ఏదైనా చేయాలి. గ్రీన్‌లాండ్‌పై పూర్తి నియంత్రణ లేకపోతే ప్రపంచం సురక్షితంగా ఉండదని లేఖలో పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ఇటీవల ట్రూత్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులో ట్రంప్‌ గ్రీన్‌లాండ్ అంశంపై మరోసారి డెన్మార్క్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

Advertisement

Details

లేఖపై అధికారిక ప్రకటన వెలువడలేదు

"గ్రీన్‌లాండ్ నుంచి రష్యా ముప్పును తొలగించాలని నాటో గత 20 ఏళ్లుగా డెన్మార్క్‌కు చెబుతోంది. కానీ వారు ఏమీ చేయలేకపోయారు. ఇక ఇప్పుడు సమయం వచ్చింది. ఇది జరగాల్సిందేనని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. గత వారం నాటో సహకరించకపోతే అమెరికా ఆ కూటమి నుంచి తప్పుకుంటుందా? అని ప్రశ్నించగా, గ్రీన్‌లాండ్ విషయంలో నాటోతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ తెలిపారు. జాతీయ భద్రతకు గ్రీన్‌లాండ్ మాకు అత్యంత కీలకం. అది లేకపోతే, ముఖ్యంగా 'గోల్డెన్ డోమ్' భద్రత విషయంలో భారీ లోటు ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ట్రంప్‌ లేఖ నిజమేనా? అన్న అంశంపై ఇప్పటికీ అధికారిక నిర్ధారణ రాలేదు.

Advertisement