US Grren Card: 75 దేశాలపై వీసా బ్రేక్.. 50 వేల అదనపు గ్రీన్‌కార్డులకు ఛాన్స్..!
ఈ వార్తాకథనం ఏంటి
వలస విధానాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నఅమెరికా ప్రభుత్వం తాజాగా కీలక అడుగు వేసింది. మొత్తం 75దేశాలకు చెందిన పౌరుల వీసా ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ పరిణామం వల్ల 2027 సంవత్సరానికి గానూ గ్రీన్‌కార్డు కోటా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇమిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో వీసాల ప్రక్రియ కొనసాగితే,ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ 75 దేశాలకు దాదాపు 67వేల ఇమిగ్రెంట్ వీసాలు జారీ అయ్యేవి. అయితే, జనవరి 21 నుంచి ఈ దేశాల పౌరుల వీసా ప్రాసెసింగ్‌ను అమెరికా నిలిపివేయడంతో,ఆ కోటా వినియోగం తగ్గింది. ఇప్పటికే అక్టోబర్ 1 నుంచి కొంతమందికి మాత్రమే వీసాలు జారీ కావడంతో,మిగిలిన సంఖ్య వచ్చే ఏడాదికి బదిలీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
75 దేశాల పౌరులపై ఈ వీసా నిలిపివేత అమల్లోకి..
ఈ నేపథ్యంలో, కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డుల కోటాలో మిగిలిన స్లాట్లను ఉద్యోగ ఆధారిత కేటగిరీకి మార్చితే, అదనంగా దాదాపు 50 వేల గ్రీన్‌కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ వెల్లడించారు. ఈ మార్పు జరిగితే ఉద్యోగాల ఆధారంగా అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఇది భారీ ఊరటగా మారనుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా, అఫ్గానిస్థాన్, బ్రెజిల్, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలతో పాటు మొత్తం 75 దేశాల పౌరులపై ఈ వీసా నిలిపివేత అమల్లోకి వచ్చింది. ఈ దేశాల నుంచి వచ్చే వలసదారులు ఎక్కువగా అమెరికా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడే అవకాశం ఉందన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.
వివరాలు
కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డుల కోటాలో అత్యధికంగా పాకిస్థాన్ పౌరులు
కొత్తగా వచ్చే వలసదారులు అమెరికా పౌరుల సంపదకు భారం కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తారని నిర్ధారణ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. 2024 గణాంకాల ప్రకారం, కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డుల కోటాలో అత్యధికంగా పాకిస్థాన్ పౌరులకు సుమారు 15 వేల గ్రీన్‌కార్డులు లభించగా, ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్‌కు చెందిన వారికి దాదాపు 8 వేల గ్రీన్‌కార్డులు దక్కాయి.