Loading...
Nvidia CEO: ఎన్విడియా సీఈఓపై ఎఫ్‌బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఎన్విడియా సీఈఓపై ఎఫ్‌బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Nvidia CEO: ఎన్విడియా సీఈఓపై ఎఫ్‌బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
07:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చైనాకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్తతో ఆయనకు ఉన్న సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ వ్యవహారంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, సదరు మహిళపై వచ్చిన ఆరోపణల గురించి జెన్సన్ హువాంగ్‌కు ముందుగా తెలిసి ఉండకపోవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

వివరాలు 

హువాంగ్‌కు ఎలాంటి సమస్య ఎదురుకాకపోవచ్చు:  ట్రంప్

వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఈ అంశంపై తాను జెన్సన్ హువాంగ్‌తో మాట్లాడినట్లు తెలిపారు.

ఆ మహిళ చైనా గూఢచారిగా పనిచేస్తున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని హువాంగ్ చెప్పినట్లు వెల్లడించారు.

ఈ వ్యవహారంపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోందని తనకు తెలుసని, అయితే హువాంగ్‌కు ఎలాంటి సమస్య ఎదురుకాకపోవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.

ఆయనను గౌరవనీయమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఆలిస్ హువాంగ్ అనే మహిళతో జెన్సన్ హువాంగ్‌కు సంబంధాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.

ఆమె గతంలో సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ ఇంటర్నేషనల్ అనే డేటా సెంటర్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

వివరాలు 

స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించిన ఎన్విడియా సంస్థ బోర్డు

మరోవైపు, జెన్సన్ హువాంగ్ అమెరికా సాంకేతిక రంగానికి సంబంధించిన సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేసినట్లు అమెరికా నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఆరోపణలపై హువాంగ్ కూడా స్పందించారు. తన భార్య, పిల్లలకు క్షమాపణలు చెబుతూ ఎన్విడియా ఉద్యోగులకు బహిరంగ లేఖ రాశారు.

ఓ వ్యాపారవేత్తతో తనకు సన్నిహిత సంబంధం ఉన్న విషయాన్ని అందులో అంగీకరించారు.

అయితే, ఆ మహిళ పేరును మాత్రం లేఖలో ప్రస్తావించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్విడియా సంస్థ బోర్డు కూడా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది.

తమ సీఈఓ విదేశీ నిఘా కార్యకలాపాలకు లక్ష్యంగా మారారా? అనే కోణంలో పరిశీలన చేపట్టింది.

ADVERTISEMENT

వివరాలు 

దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తా: జెన్సన్ హువాంగ్

ఈ వ్యవహారంలో అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం ఏదైనా బయటకు వెళ్లిందా? ఎన్విడియాకు చెందిన కీలక సాంకేతిక వివరాలు ఇతర దేశాలకు చేరాయా? అనే అంశాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని జెన్సన్ హువాంగ్ తెలిపారు.

అమెరికా జాతీయ భద్రతతో పాటు ఎన్విడియా సంస్థ ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

మరోవైపు, చైనా ప్రభుత్వం ఈ గూఢచర్య ఆరోపణలను తోసిపుచ్చింది. తమ దేశంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ విమర్శించారు.

చైనాను అపఖ్యాతిపాలు చేసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

ADVERTISEMENT