LOADING...
G7 Summit: డ్రగ్స్‌,అక్రమ వలసలపై ఉక్కుపాదం.. జీ7 దేశాల కీలక నిర్ణయాలు
డ్రగ్స్‌,అక్రమ వలసలపై ఉక్కుపాదం.. జీ7 దేశాల కీలక నిర్ణయాలు

G7 Summit: డ్రగ్స్‌,అక్రమ వలసలపై ఉక్కుపాదం.. జీ7 దేశాల కీలక నిర్ణయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
08:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారంపై ఫ్రాన్స్‌లో జరిగిన 52వ జీ7 సదస్సు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వలసదారుల స్మగ్లింగ్‌, మానవ అక్రమ రవాణా ద్వారా లాభాలు పొందుతున్న అంతర్జాతీయ నేర ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. డ్రగ్స్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలతో పాటు వాటికి సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలను అరికట్టేందుకు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ప్రతినబూనాయి. మహిళలు,చిన్నారులు,శరణార్థులు వంటి బలహీన వర్గాలు ఈ నేర ముఠాల చేతుల్లో ఎక్కువగా దోపిడీకి గురవుతున్నాయని జీ7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

వివరాలు 

సోషల్‌ మీడియా ద్వారా అక్రమ వలసలకు అడ్డుకట్ట

అక్రమ వలసలను నియంత్రించేందుకు రూపొందించిన జీ7 కార్యాచరణ ప్రణాళికను మరింత సమర్థంగా అమలు చేయాలని సభ్య దేశాల మంత్రులకు సూచించాయి. సదస్సు ముగింపు సందర్భంగా జీ7 దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇటీవలి కాలంలో నేర ముఠాలు సోషల్‌ మీడియా, డిజిటల్‌ వేదికలను ఉపయోగించి అక్రమ వలసలకు సంబంధించిన ప్రకటనలు, మోసపూరిత సమాచారం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని జీ7 దేశాలు గుర్తించాయి. దీంతో ఆన్‌లైన్‌ వేదికల నిర్వాహక సంస్థలతో సమన్వయం పెంచి అక్రమ వలసలను ప్రోత్సహించే కంటెంట్‌ను గుర్తించడం, తొలగించడం, కొత్త ప్రచారాలను అడ్డుకోవడం వంటి చర్యలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి.

వివరాలు 

ఏఐలో అమెరికా ఆధిపత్యంపై జీ7 దృష్టి

అలాగే చట్టబద్ధ అనుమతులు లేకుండా ఇతర దేశాల్లో నివసిస్తున్న వ్యక్తులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను మరింత సమర్థంగా అమలు చేయాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రక్రియ సకాలంలో,సురక్షితంగా,చట్టబద్ధంగా,మానవ గౌరవానికి భంగం కలగకుండా నిర్వహించాలని స్పష్టం చేశాయి. కృత్రిమ మేధ(ఏఐ)రంగంలో భవిష్యత్తులో తలెత్తే సవాళ్లు, ఏఐలో అమెరికా ఆధిపత్యం వంటి అంశాలపై కూడా జీ7 దేశాలు చర్చించాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి,సాంకేతిక రంగంలో సహకారం వంటి అంశాలు కూడా సభ్య దేశాల నేతల చర్చల్లో చోటు చేసుకున్నాయి. సదస్సు మూడో రోజు ఏఐపై నిర్వహించిన సమావేశంలో ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌,గూగుల్‌ డీప్‌మైండ్‌ సీఈవో డెమిస్‌ హసబిస్‌,ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడీతో పాటు పలువురు ప్రముఖ ఏఐ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

వివరాలు 

చైనా చౌక ఉత్పత్తులపై ఆందోళన

అనంతరం జీ7 నేతలతో కలిసి ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ప్రపంచ మార్కెట్లను చైనా చౌక ఉత్పత్తులు ముంచెత్తుతున్న తీరుపైనా జీ7 దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ ధరలకు వస్తువులను సరఫరా చేయడం వల్ల ఆయా దేశాల్లోని స్థానిక పరిశ్రమలు దెబ్బతింటున్నాయని, ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని అభిప్రాయపడ్డారు. 2000 ప్రాంతంలో చైనా ఉత్పత్తుల ప్రభావంతో అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితులు తలెత్తాయని, అదే పరిస్థితి ఐరోపా దేశాల్లోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సవాలును ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు సమిష్టిగా వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉందని జీ7 నేతలు పేర్కొన్నారు.

Advertisement