Trump: ట్రంప్ యూటర్న్..ఇరాన్‌పై దాడుల విరమణ
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన వైఖరిలో అనూహ్య మార్పు చూపించారు. ఇరాన్‌పై తాజా దాడులను విరమించుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. రెండు దేశాల మధ్య చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని వెల్లడించారు. ఇరాన్ అగ్రనాయకత్వం అమెరికా ప్రతిపాదనలకు అంగీకరించిందని, ఇక అధికారిక సంతకాల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, తుర్కియే, పాకిస్థాన్, బహ్రెయిన్, ఈజిప్టు కూడా సమ్మతి తెలిపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. సంతకాలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. అయితే ఒప్పందానికి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు.
వివరాలు
ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్
అలాగే, ఒప్పందం పూర్తిగా అమల్లోకి వచ్చే వరకు ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ వెంటనే ఖండించింది. అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని మరోసారి స్పష్టంచేసి, ట్రంప్ ప్రకటనలకు భిన్నంగా స్పందించింది.
వివరాలు
ముందు ఏమన్నారంటే..
తాజా ప్రకటనకు కొన్ని గంటల ముందే ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆ దేశంలోని చమురు క్షేత్రాలు, సహజవాయు పరిశ్రమలన్నింటినీ అమెరికా నియంత్రణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఖర్గ్ దీవిపై ఆధిపత్యం సాధించే రోజు ఎంతో దూరంలో లేదని సామాజిక మాధ్యమ పోస్టులో రాశారు. అంతేకాకుండా, హర్మూజ్ జలసంధి మీదుగా లక్షల బ్యారెళ్ల చమురును రహస్యంగా తరలించినట్లు వెల్లడించారు. ఒక్క రాత్రిలోనే 22 చమురు నౌకలను చీకట్లో లైట్లు లేకుండా, రాడార్లకు చిక్కకుండా సురక్షితంగా పంపించామని చెప్పారు. ఈ విషయం ఇరాన్‌కు కూడా ఇప్పుడు తెలుస్తోందని వ్యాఖ్యానించారు.
వివరాలు
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు
ఇదిలా ఉండగా,బుధవారం కంటే గురువారం అమెరికా బలగాలు మరింత తీవ్రంగా ఇరాన్‌పై దాడులు జరిపినట్లు సమాచారం. బందర్ అబ్బాస్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించగా,సిరిక్,మినాబ్ పట్టణాలు,ఖేష్మ్ ద్వీపం, ఉత్తర ప్రాంతంలోని గోర్గాన్ నగరంలో కూడా పేలుళ్లు చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. మరోవైపు, కువైట్, బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిపినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా తమ సహనాన్ని పరీక్షిస్తోందని, దాడులు, బెదిరింపులకు తమ సాయుధ దళాలు తప్పకుండా ప్రతిస్పందిస్తాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. క్షేమంగా ఉండాలంటే అమెరికా బలగాలు వెంటనే ఈ ప్రాంతాన్ని వీడాలని సూచించారు.
వివరాలు
ఐరాస సెక్రటరీ జనరల్ ఆందోళన
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి యుద్ధం కాకుండా దౌత్య మార్గాలను అనుసరించాలని, శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.