
Donald Trump: 'ఈ యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు': రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనబోదు: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో మరోసారి చర్చనీయాంశంగా మారారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేరును ప్రస్తావిస్తూ, ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొనుగోళ్ల (Russian Oil) అంశంపై తన పూర్వపు వైఖరికి విరుద్ధంగా ఈసారి భిన్నమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంతకుముందు భారత్ రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని ఆయన ప్రకటించినప్పటికీ, ఇప్పుడు భారత్ భారీ స్థాయిలో చమురు కొనుగోలు చేయబోదని తెలిపారు. మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) వైట్‌హౌస్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నారు.
వివరాలు
మోదీ గొప్ప నాయకుడు, మంచి స్నేహితుడు
ఈ సందర్భంగా ట్రంప్ భారతీయ-అమెరికన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. "మోదీ గొప్ప నాయకుడు, మంచి స్నేహితుడు. భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజు నేను మీ ప్రధానితో మాట్లాడాను. మాకు అద్భుతమైన సంభాషణ జరిగింది. వాణిజ్య సంబంధాలపై విస్తృతంగా చర్చించాం. ఆయనకు ఆ అంశంపై చాల ఆసక్తి ఉంది," అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే పాకిస్థాన్‌తో ఉన్న ఉద్రిక్తతలపై కూడా చర్చించామన్నారు.వాణిజ్యం ద్వారానే ఇరుదేశాల మధ్య శాంతి సాధ్యమని నమ్ముతున్నానని తెలిపారు. తనకు భారతీయులంటే చాలా ఇష్టమని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత్,అమెరికా దేశాలు కొన్ని కీలక ఒప్పందాల కోసం కలిసి పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.
వివరాలు
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియాలని కోరుకున్న మోదీ
అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయబోదన్న వ్యాఖ్యలు చేయడం ట్రంప్ పూర్వపు ప్రకటనలకు విరుద్ధంగా ఉంది. ఇంతకుముందు భారత్ చమురు దిగుమతులను నిలిపివేసిందని తానే ప్రకటించిన ట్రంప్, ఇప్పుడు తన మాట మార్చడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అలాగే, మోదీ కూడా ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే, ట్రంప్, మోదీల మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నప్పటికీ, భారత్ అధికారికంగా దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
వివరాలు
ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన భారత విదేశాంగ శాఖ
గతంలో కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మోదీ రష్యా చమురు కొనుగోళ్లు ఆపుతామని తనకు హామీ ఇచ్చారని అన్నారు. కానీ, ఆ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ స్పష్టంగా ఖండించింది. అలాంటి సంభాషణ అసలు జరగలేదని ప్రకటించింది. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అధ్యక్షుడు మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.